భారీ ఎత్తున మహిళా ఉద్యోగుల తొలగింపు, ట్విటర్‌ ఆఫీస్‌ ఫోటోలు వైరల్‌

21 Nov, 2022 15:42 IST|Sakshi

ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ నిర్ణయాలు ఆ సంస్థ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో సగం మందిపైగా ఉద్యోగుల్ని తొలగించారు. అవి సరిపోవన్నట్లు ఎక్కువ గంటల పని చేయడంతో పాటు హార్డ్‌ వర్క్‌ చేయాలని ఉద్యోగులకు మస్క్‌ అల్టిమేట్టం జారీ చేశారు. దీంతో మస్క్‌ తీరును విమర‍్శిస్తూ భారీ ఎత్తున రాజీనామాలు చేశారు. ఇప్పుడు మరింత మంది ఉద్యోగులు ట్విటర్‌ను వీడనున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో ఉద్యోగులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ట్విటర్‌ ఉద్యోగుల్ని ఫైర్‌ చేయడంతో ఆఫీస్‌ బోసి పోతుంది’ అంటూ లురెన్‌ చెన్‌ అనే ట్విటర్‌ యూజర్‌  కొన్ని ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. ‘మస్క్‌ రాకముందు.. మస్క్‌ వచ్చిన తర్వాత’ అంటూ ఒక ఫోటోని షేర్‌ చేశారు.

అందులో ఎడమవైపు ఫోటోలో మహిళా ఉద్యోగులు వారి సహచర ఉద్యోగులైన పురుషులతో ఓ స్టిల్‌ ఫోటో దిగారు. కుడివైపు ఫోటోలో ఎలాన్‌ మస్క్‌, పురుషులు, ఇద్దరు మహిళలు మాత్రమే కనిపించారు. ఆ ఫోటోల్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఈవోగా ఎలాన్‌ మస్క్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్విటర్‌లో లింగ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెన్‌ ట్వీట్‌లకు రిప్లయి ఇస్తున్నారు. 

ఆశ్చర్యంగా మస్క్‌ ట్విటర్‌ ప్రధాన కార్యాలయం 10వ ఫ్లోర్‌లో కోడర్లతో నిర్వహించిన రివ్వ్యూ మీటింగ్‌ ఫోటోల్ని షేర్‌ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతుండగా.. పలువురు నెటిజన్లు మహిళా ఉద్యోగులు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.

మహిళా సిబ్బంది లేకపోవడాన్ని ట్విటర్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కేబినెట్‌తో పోల్చుతున్నారు. ట్రంప్‌ కేబినెట్‌లో మహిళల లేరని.. అలాగే మస్క్‌ బాస్‌గా ఉన్న  ట్విటర్‌లో మహిళలు లేరంటూ ట్రంప్‌ - మస్క్‌లను ఒకరితో ఒకరిని పోల్చుతున్నారు. 

చదవండి👉 ‘బాబ్బాబూ ఒక్కసారి రావూ’..ఉద్యోగుల్ని బ్రతిమిలాడుతున్న ఎలాన్‌ మస్క్‌!

>
మరిన్ని వార్తలు