మొదటి సారి ఇంధన రంగంలోకి పీఏసీఎస్‌.. పెట్రోల్‌ బంకులు రాబోతున్నాయ్‌!

17 Jan, 2023 11:48 IST|Sakshi

తొలిదశలో 96 పీఏసీఎస్‌ల్లో ఏర్పాటుకు సన్నాహాలు

ముందుకొచ్చిన హెచ్‌పీసీఎల్‌ ఆయిల్‌ కంపెనీ

పైలట్‌ ప్రాజెక్టుగా మూడు పీఏసీఎస్‌లలో ఏర్పాటు

ఉగాది కల్లా మిగిలిన పీఏసీఎస్‌ల పరిధిలో ఏర్పాటుకు కసరత్తు 

సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఆర్థిక పరిపుష్టిపై దృష్టి సారించాయి. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయ ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. మొదటి సారి ఇంధన రంగంలోకి ప్రవేశించాయి. సహకార పెట్రోలు బంకులు ఏర్పాటు చేసి తమ ఆర్థిక పరపతిని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. 

ఒక్కో బంకు రూ.25లక్షలతో ఏర్పాటు
ఏపీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు అనుబంధంగా 1,992 పీఏసీఎస్‌లున్నాయి. వాటిలో 1,450 పీఏసీఎస్‌లు లాభాల్లో ఉన్నాయి. మిగిలిన వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఆప్కాబ్‌ చేయూత నిస్తోంది. బహుళ సేవా కేంద్రాలు (ఎంఎస్‌సీ)గా వీటిని తీర్చిదిద్దేందుకు ఆప్కాబ్‌ చర్యలు చేపట్టింది. స్థలాలు అందుబాటులో ఉండి స్థానికంగా ఫీజుబులిటీ కల్గిన పీఏసీఎస్‌ల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ఒక్కో బంకు రూ.25లక్షల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. స్థలాలు చూపిస్తే చాలు ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పైసా ఖర్చు లేకుండా పీఏసీఎస్‌లకు డీలర్‌షిప్‌లు మంజూరు చేసేందుకు హెచ్‌పీసీఎల్‌ ముందు కొచ్చింది. బంకు నిర్మాణానికి అవసరమైన మౌ­లిక సదుపాయాలన్నీ హెచ్‌పీసీఎల్‌ సమకూర్చనుంది. నిర్వహణ బాధ్యతలను పీఏసీఎస్‌లకు అప్పగిస్తారు. నిర్వహణ ఖర్చులు పోనూ నెలకు రూ.లక్షకు పైగా మిగులుతుందని అంచనా వేసు­్తన్నా­రు.
బంకుల ఏర్పాటుకు 

అనువుగా 96 పీఏసీఎస్‌లు
తొలిదశలో బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలున్న 130 పీఏసీఎస్‌లను గుర్తించారు. వాటిలో 96 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు ఫీజుబులిటీ ఉందని ఆయిల్‌ కంపెనీలు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాయి. వాటిలో ఇప్పటికే 77 పీఏసీ­ఎస్‌లకు ఆయిల్‌ కంపెనీలు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్స్‌ జారీ చేశాయి. కాగా 18 పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తది­తర శాఖల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)లు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒకటి, ఏలూ­రు జిల్లా పరిధిలోని కె.జగ్గవరం, ముల్ల­కుం­ట పీఏసీఎస్‌ల్లో పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చే­యగా, మిగిలిన 15 పీఏసీఎస్‌ల్లో జనవరి నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజుబులిటీ ఆధారంగా మిగిలిన పీఏసీఎస్‌ల పరిధిలో బంకుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.

లాభాల బాట పట్టించడమే లక్ష్యం
నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం. స్థలాలు అందుబాటులో ఉండి, ఫీజు బు­లి­టీ ఉన్న పీఏసీఎస్‌ పరిధిలో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు అనుమతినిస్తాం. బంకులే కాదు..వారు ఏ తరహా వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చినా ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆప్కాబ్‌ సిద్ధంగా ఉంది.
–ఆర్‌.శ్రీనాథ్‌రెడ్డి, ఎండీ, ఆప్కాబ్‌

మరిన్ని వార్తలు