స్టాక్ మార్కెట్లలో తెలుగువారి హవా..భారీగా పెట్టుబడులు..! 

5 Apr, 2022 15:28 IST|Sakshi

ప్రతీ 100మందిలో 8.8 శాతం  బీఎఎస్‌ఈలో ట్రేడింగ్‌ 

ఇది దేశీయ సగటు 7.4 శాతం కంటే అధికం 

దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర

ఆ రాష్ట్రంలో 2.07 కోట్ల  స్టాక్‌ మదుపరులు

బీఎస్‌ఈలో 10 కోట్లు దాటిన ఇన్వెస్టర్ల సంఖ్య 

స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: మదుపు కోసం స్టాక్‌ మార్కెట్ల తలుపుతట్టడంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. దేశ సగటు కంటే  ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా స్టాక్‌ మార్కెట్‌లో ఖాతాలు ఉన్నట్లు స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో 8.8 శాతం మంది బొంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీ(బీఎస్‌ఈ)లో మదుపుదారుగా నమోదయి ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

అంటే ప్రతీ 100 మందిలో 8.8 శాతం మంది బీఎస్‌ఈ ద్వారా స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో 8.2 శాతం, కర్నాటకలో 8.7 శాతం, తమిళనాడులో 7.0 శాతం, పుదిచ్చేరిలో 6 శాతం ఉండగా కేరళలో 7 శాతంగా ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో  ఆంధ్రా నుంచే అత్యధికంగా స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.  దేశం మొత్తం మీద చూస్తే 7.4 శాతం మంది మాత్రమే స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మాత్రం 8.8 శాతం మంది ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే ఢిల్లీ 23.6 శాతంతో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 16.6 శాతం, గుజరాత్‌ 15.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

47 లక్షల మంది ఇన్వెస్టర్లు 
దేశవ్యాప్తంగా బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంఖ్య ఈ మార్చి నాటికి 10 కోట్ల మార్కును అధిగమించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 47 లక్షల మంది స్టాక్‌ మార్కెట్లో ఖాతాలను కలిగి ఉన్నట్లు స్టాట్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దేశం మొత్తం మీద 10 కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నా అందులో 50 శాతం మంది అయిదు రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 2.07 కోట్ల ఖాతాలు ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌ 1.09 కోట్లు, ఉత్తరప్రదేశ్‌ 86 లక్షలు, కర్నాటక 58 లక్షలు, రాజస్థాన్‌ 56 లక్షలుగా ఉన్నాయి. ఖాతాల సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంటే, 31 లక్షల ఖాతాలతో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 

కొత్త ఖాతాల్లో నెమ్మది...
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు స్టాక్‌ మార్కెట్లో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా స్టాక్‌ మార్కెట్లు వేగంగా పెరుగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్న తరుణంలో గత 12 నెలల కాలంలో స్టాక్‌ మార్కెట్లో ఖాతాల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఏకంగా రెట్టింపు నమోదవ్వగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొత్త ఖాతాల పెరుగుదల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 10 కోట్ల ఖాతాల సంఖ్యలో గత 12న నెలల్లోనే 3.6 కోట్ల ఖాతాలు కొత్తగా వచ్చిచేరాయి. ఈ పెరుగుదల అస్సాంలో 283 శాతంగా ఉంటే బీహార్‌ 116 శాతం, మధ్యప్రదేశ్‌109 శాతం, ఒరిస్సా 106 శాతం, తెలంగాణ 79 శాతంగా ఉంది. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాల పెరుగుదల 40 శాతానికే పరిమితమయ్యింది. 

చదవండి: స్టాక్‌ మార్కెట్‌లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు

>
మరిన్ని వార్తలు