Anil Ambani: అనిల్‌ అంబానీకి గట్టి షాక్‌..! మూడు నెలల పాటు అడుగు పెట్టేదేలే..!

12 Feb, 2022 12:32 IST|Sakshi

అనిల్‌ అంబానీకి సెబీ గట్టి షాక్‌ను ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా శుక్రవారం రోజున రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం లేదా డీల్‌ చేయకుండా నిషేధించింది. అనిల్‌తో పాటుగా మరో ముగ్గురినీ కూడా నిషేధించినట్లు సమాచారం. 

మూడు నెలల పాటు నిషేధం..!
అనిల్‌ అంబానీ మార్కెట్లలోకి అడుగుపెట్టకుండా మూడు నెలల పాటు సెబీ నిషేధాన్ని విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏ విధంగానైనా నేరుగా లేదా పరోక్షంగా వారు సెక్యూరిటీలలో డీల్ చేయలేర‌ని సెబీ పేర్కొంది. కంపెనీ నుంచి నిధులను మళ్లించారనే ఆరోపణలతో అనిల్‌ అంబానీతో పాటుగా, ఇతర వ్యక్తులను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిరోధించాలనే నిర్ణయం తీసుకుంది. 

అనిల్‌ అంబానీతో పాటుగా...అమిత్‌ బప్నా, రవీంద్ర సుధాకర్‌, పింకేశ్‌ ఆర్‌షాపై కూడా సెబీ నిషేధం విధించింది.  ‘సెబీ వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియరీతో కానీ, ఏ లిస్టెడ్‌ కంపెనీతో కానీ లేదా ఏ పబ్లిక్‌ కంపెనీకి చెందిన డైరెక్టర్లు, ప్రమోటర్ల నుంచి కానీ తదుపరి ఉత్తర్వులు అందేంత వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాద’ని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ జారీ చేసిన 100 పేజీల మధ్యంతర ఆదేశాల్లో స్పష్టం చేసింది.

నిధుల గోల్‌మాల్‌..!
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్) 2018-19లో అనేక రుణాలు తీసుకున్న సంస్థలకు రుణాలు పంపిణీ చేసిన విధానాన్ని సెబీ విచారణ పరిశీలించిందని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కనీసం 13 సంస్థలకు నిధులను బదిలీ చేసిందని సెబీ కనుగొంది. 

చదవండి: అయ్యో అనిల్‌ అంబానీ! నీకే ఎందుకిలా ?

మరిన్ని వార్తలు