వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో వీడియో కాల్స్‌.. ఆపై బ్లాక్‌మెయిల్‌!

24 Nov, 2021 17:12 IST|Sakshi

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లలో తెలియని ఏదో అకౌంట్‌ నుంచి వీడియో కాల్స్‌ వస్తుంటాయి. లిఫ్ట్‌ చేయగానే.. షాక్‌.  అవతల నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. ఏం జరుగుతుందో ఊహించే లోపే కాల్‌ కట్‌ అవుతుంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది.  


కాసేపటికి అన్‌నోన్‌ నెంబర్‌ లేదంటే సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ లేదంటే మెసేజ్‌లు వస్తాయి. అశ్లీల వీడియోలు చూసిన మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశామనో, ఫొటోలు తీశామనో బెదిరిస్తారు. కొంత డబ్బును డిమాండ్‌ చేస్తూ.. ట్రాన్స్‌ఫర్‌ చేయకపోతే ఆ వీడియో/ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరిస్తారు. ఈ వ్యవహారాలను కొందరు లైట్‌ తీస్కుంటే.. చాలామంది భయంతో కంగారులో ఏం చేయాలో పాలుపోక వణికిపోతారు. సదరు అకౌంట్‌లను బ్లాక్‌ చేయడమో లేదంటే యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడమో చేస్తుంటారు.  అయినా బెదిరింపులు ఆగిపోతాయనుకోవడం పొరపాటే!.
 

చదవండి: సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌! ఇక సైబర్‌ కేటుగాళ్ల ఆటకట్టు..
 

దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే సైబర్‌ నేరాల్లో భారత్‌ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్‌టార్షన్‌’ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్‌ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

కేవలం మేవాత్‌ (హర్యానా), భరత్‌పూర్‌ (రాజస్థాన్‌) నుంచి 36 బ్యాచ్‌లు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే 600 మందికి పైగా అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించి ఆపై వాటిని బూచిగా చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయి ఈ ముఠాలు.  నిజానికి సెక్స్‌టార్షన్‌.. నేరాలు కొత్తేం కాదు. కాకపోతే లాక్‌డౌన్‌ నుంచి ఈ తరహా నేరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని లక్క్ష్యంగా, మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు ఈమధ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 

మీకు తెలుసా?.. డిలీటైన వాట్సాప్‌ డేటాను సింపుల్‌గా ఇలా బ్యాకప్‌ చేయొచ్చు
 

ఏం చేయాలంటే.. 
సెక్స్‌టార్షన్‌లు చాలా సీరియస్‌ నేరాలు. ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లోగానీ, వాట్సాప్‌లోగానీ, ఇతర ఏ యాప్‌లలో అయినాగానీ తెలియని అకౌంట్లు, గుర్తుతెలిని నెంబర్ల నుంచి వీడియో కాల్స్‌ వచ్చినప్పుడు లిఫ్ట్‌ చేయకపోవడమే మంచిది. ఒకవేళ కంగారులో లిఫ్ట్‌ చేసినా కెమెరాను కవర్‌ చేయాలి. కాల్స్‌ వచ్చే నెంబర్లు, అకౌంట్లను బ్లాక్‌ చేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయాలి. బ్లాక్‌మెయిలింగ్‌ కాల్స్‌, మెసేజ్‌లకు ఎక్కువసేపు స్పందించకుండా ఉంటే.. ఫిర్యాదు చేస్తారేమోనని నేరగాళ్లే భయపడొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయడమే ఉత్తమమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు