డియర్‌ యాపిల్‌.. మా జెండా కనిపించలేదేం!.. నటుడి నిరాశ

17 Sep, 2021 08:41 IST|Sakshi

Anupam Kher On Apple: యాపిల్‌ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజు ఉంటుంది. పైగా ఆ ప్రొడక్టుల కొనుగోళ్లలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని తెలిసిన విషయమే కదా. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్‌ను భారత్‌ నుంచే ఎక్కువ మంది లైవ్‌లో వీక్షించారు. అయితే యాపిల్‌ మాత్రం భారత్‌ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌.
 

నటుడు అనుపమ్‌ ఖేర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.  న్యూయార్క్‌ ఫిఫ్త్‌ ఎవెన్యూలోని యాపిల్‌ స్టోర్‌ను మొన్న మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్‌ కలెక్షన్‌ పేరుతో కొన్ని వాచీలను డిస్‌ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్‌ జెండా కనిపించకపోయే సరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ పెట్టారు. 

స్మార్ట్‌ వాచీ కలెక్షన్‌ బాగుంది. కెనెడా, ఆసీస్‌, ఫ్రాన్స్‌.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్‌ ఉంచారు.  కానీ, అందులో భారత్‌ జెండా మాత్రం లేదు. ఈ విషయంలో నిరాశ చెందాను.. కారణం ఏమై ఉంటుంది? యాపిల్‌ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు కదా! మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే యాపిల్‌ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!

చదవండి: ఐఫోన్‌ 13 లాంఛ్‌.. ఊహించని ట్విస్ట్‌

మరిన్ని వార్తలు