టాన్‌ఫాక్‌ భాగస్వామిగా అనుపమ్‌

3 Feb, 2022 06:26 IST|Sakshi

24.96 శాతం

బిర్లా గ్రూప్‌ వాటా కొనుగోలు

మరో 26 శాతం వాటాకు ఓపెన్‌ ఆఫర్‌

ముంబై: టాన్‌ఫాక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(టీఐఎల్‌)లో 24.96 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు స్పెషాలిటీ కెమికల్, కస్టమ్‌ సింథసిస్‌ కంపెనీ అనుపమ్‌ రసాయన్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఆర్‌ఐఎల్‌) తాజాగా పేర్కొంది. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ బిర్లా గ్రూప్‌ హోల్డింగ్స్‌(బీజీహెచ్‌), తదితరుల నుంచి ఈ వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 148 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వెల్లడించింది.

దీంతోపాటు సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు వివరించింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పేర్కొంది. ఈ వాటాకు రూ. 154.3 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. నిధులను రుణాల ద్వారా సమీకరించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో)తో బీజీహెచ్‌కు గల భాగస్వామ్య ఒప్పందాన్ని సవరించనున్నట్లు వివరించింది. తద్వారా బీజీహెచ్‌ స్థానే జేవీలో ఏఆర్‌ఐఎల్‌ భాగస్వామిగా చేరనున్నట్లు తెలియజేసింది. ఫ్లోరినేషన్‌ కెమిస్ట్రీ బిజినెస్‌కు టీఐఎల్‌ కొనుగోలు మరింత బలాన్నివ్వగలదని అనుపమ్‌ రసాయన్‌ ఎండీ ఆనంద్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా కొత్త డెరివేటివ్స్‌ను సైతం రూపొందించేందుకు వీలుంటుందని తెలియజేశారు.

ఈ వార్తల నేపథ్యంలో అనుపమ్‌ రసాయన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,048 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,107ను అధిగమించి కొత్త గరిష్టాన్ని తాకింది. 

మరిన్ని వార్తలు