ఏపీలో ఉద్యోగులు పెరిగారు.. ఆదాయం పెరిగింది! ఇవిగో లెక్కలు

14 Feb, 2024 14:26 IST|Sakshi

అభివృద్ధికి స్పష్టమైన నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్‌

ఏపీ డెవలప్‌మెంట్‌కు సాక్ష్యంగా కేంద్ర గణాంకాలు

గత మూడేళ్లలో ఏపీలో కొత్తగా ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేసినవాళ్లు 18  లక్షల మంది

ఇది దేశంలోనే టాప్

వెల్లడించిన ఎస్‌బీఐ నివేదిక

రాష్ట్రంలో కొత్తగా 16 లక్షల మంది ఉద్యోగాల్లో చేరినట్టు ఇటీవలే ప్రకటించిన కేంద్ర మంత్రి

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ రంగాల్లో ఉద్యోగులు పెరిగారు. వారి సంపాదన, ఆదాయం పెరిగింది. ఇవి ఎవరో చెప్పిన మాటలు కావు. ఇన్‌కమ్‌ రిటర్న్స్‌ ఫైలింగ్స్‌ ఆధారంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ( SBI ) తాజా నివేదిక వెల్లడించిన గణాంకాలివి. రాష్ట్రంలో ఉ‍ద్యోగాలు లేవు.. కొత్తగా ఏమీ రావట్లేదు.. యువత బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్నారంటూ అరకొర, అసత్య విమర్శలు చేసేవారికి ఈ గణాంకాలు చెంపపెట్టు.

అసెస్‌మెంట్ సంవత్సరం 2020 నుంచి 2023 మధ్య కొత్తగా పన్ను దాఖలు చేసినవారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో 18 లక్షల మంది కొత్తగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అసెస్‌మెంట్ ఇయర్స్‌ 2020 నుంచి 2023 మధ్య కాలంలో దాఖలైన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్స్‌ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 

ఎస్‌బీఐ నివేదిక ప్రకారం మూడేళ్లలో కొత్తగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 18 లక్షలు ఉండగా ఆ తర్వాత మహారాష్ట్ర (13.9 లక్షలు), ఉత్తరప్రదేశ్ (12.7 లక్షలు), గుజరాత్ (8.8 లక్షలు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 

ఇక ఇతర దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సంఖ్య తమిళనాడులో 4 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, కేరళలో 3 లక్షలు  ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రతికూల వృద్ధిని సాధించింది. ఈ కాలంలో 12 లక్షల మంది ఐటీఆర్‌ ఫైలర్లు తగ్గిపోయారు. 

పెరిగిన ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈపీఎఫ్‌ ఖాతాల ద్వారా తెలిసింది ఏమిటంటే..  ఏపీలో కొత్తగా 16 లక్షల మంది ఉద్యోగాల్లో చేరినట్టు  రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గతేడాది డిసెంబర్‌ 22న ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, వారి ఆదాయాలు పెరిగినట్లు చట్టబద్ధమైన కేంద్ర సంస్థల గణాంకాలు చెబుతుంటే.. కొందరు మాత్రం పనికట్టుకుని ఏపీపై విష ప్రచారం చేస్తున్నారు. ఆదాయాలు పెరిగితేనే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేస్తారు. వీరిలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు ఈపీఎఫ్‌ ఖాతాల ఆధారంగా కేంద్ర మంత్రి సైతం వెల్లడించారు. 


విద్యుత్తు శాఖలో ఇలా..

  • వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు
  • విద్యుత్‌ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728
  • 2019లో తొలి విడత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయినవి: 1,05,869
  • 2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయినవి: 13,136
  • రెండు విడతల నోటిఫికేషన్‌ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529
  • తొలి విడత నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్‌మెంట్‌ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారని ఇప్పటికే అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని గతంలో సీఎం జగన్‌ చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని గతంలో సీఎం చెప్పారు. ఇవికాక కాంట్రాక్ట్‌ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్‌ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించామని, ఇందులో 83–84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని వివరించారు.

ఆర్‌బీఐ నివేదికలోనూ..

చంద్రబాబు పాలనలోని 2018–19లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 33కు తగ్గినట్లు ఆర్‌బీఐ ఇదివరకే తెలిపింది. అలాగే 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గిందని నివేదిక వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్యలో 2018–19 కంటే 2022–23లో తగ్గిందని పేర్కొంది.

whatsapp channel

మరిన్ని వార్తలు