ఇకపై అపార్ట్‌మెంట్లలో మరిన్ని లిఫ్టులు? కొత్త చర్చకు తెర తీసిన హైదరాబాద్‌ ఘటన!

13 Jan, 2022 15:57 IST|Sakshi

హైదరాబాద్‌లో ఓ ఆపార్ట్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారింది. అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు, మెయింటనెన్స్‌లపై సరికొత్త ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ వేదికగా వందల కొద్ది వ్యక్తులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. 

వివాదానికి కారణం
హర్షవడ్లమాని అనే ట్విట్టర్‌ యూజర్‌ జనవరి 12న నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్టు దగ్గర అంటించి నోటీస్‌ పోస్టర్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌  చేశారు. ఆ నోటీసులో ఇంటి పని చేసేవాళ్లు, డెలివరీ బాయ్స్‌, డ్రైవర్లు మెయిన్‌ లిఫ్టు ఉపయోగిస్తే రూ.300 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

ఇది సరికాదు.. కేటీఆర్‌ స్పందించాలి
ఇంట్లో పని చేసేవాళ్లు, డ్రైవర్లు, డెలివరి బాయ్స్‌ పట్ల సదరు అపార్ట్‌మెంట్‌ వాసులు వివక్ష చూపిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులందరు ఒకటే అని కానీ ఇలాంటి నిర్ణయాలు ఈ రోజుల్లో కూడా అమలు చేస్తున్నారా ? అంటూ ఆగ్రహం వ్యక​‍్తం చేస్తున్నారు. సాటి మనుషుల పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. పని వాళ్లు వండిన తిండి తింటూ వారిని ఇలా అవమానించడం సరికాదంటున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. 

మేము ఇలాగే చేస్తున్నాం
పని మనుషులు లిఫ్ట్‌ ఉపయోగిస్తే రూ.300 ఫైన్‌ విధించే నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుంటే.. మరికొందరు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తున్నారు. కరోనా వైరస్‌ భయం కారణంగా అపార్ట్‌మెంట్‌లో రాకపోకలు, కదలికపై ఆంక్షలు అమలు చేస్తున​‍్నట్టు చెబుతున్నారు. మెయిన్‌ లిఫ్టు వాడకంపై ఆంక్షలు ఉండటం సరైనదే అని.. ఎక్కువగా ఫోకస్‌ అయ్యే పని వాళ్లు, డెలివరీ పర్సన్స్‌, డ్రైవర్లు తదితరుల కోసం సర్వీసు లిఫ్టు అందుబాటులో ఉంటుందని బదులిస్తున్నారు. మరికొందరు తమ అపార్ట్‌మెంట్‌లో రెండు లిఫ్టులు ఉంటే ఒకటి కోవిడ్‌ రిస్క్‌​ ఎక్కువగా ఉండే వృద్ధులకు, మరొకటి మిగిలిన వాళ్లు ఉపయోగిస్తున్నామని వివరిస్తున్నారు. రిస్క్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కఠిన నిర్ణయాలు తప్పడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. 

భవిష్యత్తులో ఇవి తప్పవా?
కోవిడ్‌ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మాస్క్‌, శానిటైజర్‌, ఫిజికల్‌ డిస్టెన్స్‌ వంటివి నిత్య జీవితంలో భాగమయ్యాయి. వర్క్‌ ఫ్రం హోం, హైబ్రిడ్‌ వర్క్‌లాంటి పని విధానాలు వచ్చాయి. కోవిడ్‌ ఎండెమిక్‌గా ఉండిపోయే అవకాశం ఉందని ఇప్పుడే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కరోనా ఉన్నంత కాలం అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ, హౌసింగ్‌ సొసైటీల్లో ఈ సమస్య పదే పదే ఉత్పన్నం అవుతుందంటున్నారు. ఇరు వర్గాల వాదనల్లో వాస్తవం ఉందంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణంలోనే సర్వీస్‌ లిఫ్టులు, శానిటైజర్‌ ఛాంబర్స్‌, డెలివరీ గేట్‌వే తదితర ఏర్పాట్లు తప్పవా ? అనే చర్చ రియల్టీ వర్గాల్లో నడుస్తోంది. 

చదవండి: గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లో హైదరాబాద్‌ రికార్డ్‌

మరిన్ని వార్తలు