ఏడు పట్టణాల్లో 1.61 లక్షల ఫ్లాట్స్‌ విక్రయాలు

12 Oct, 2022 03:26 IST|Sakshi

జనవరి–సెప్టెంబర్‌ మధ్య నమోదు 

జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌ మధ్య 1,61,604 ఫ్లాట్స్‌ అమ్ముడుపోయినట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది. ఏడేళ్ల కాలంలో వార్షిక విక్రయాల రేటును ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే అధిగమించినట్టు తెలిపింది. హైదరాబాద్, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై పట్టణాల గణాంకాలు జేఎల్‌ఎల్‌ తాజా నివేదికలో ఉన్నాయి.

ఇందులో కేవలం ఫ్లాట్స్‌ విక్రయాలనే పొందుపరిచింది. 2014లో 1,65,791, 2015లో 1,57,794, 2016లో 1,46,852, 2017లో 95,774, 2018లో 1,36,082, 2019లో 1,43,302 యూనిట్లు చొప్పున ఫ్లాట్స్‌ విక్రయమయ్యాయి. 2020లో కరోనా కారణంగా విక్రయాలు 74,211 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది 1,28,064 ఫ్లాట్స్‌ అమ్ముడుపోయాయి. ఈ విధంగా చూసుకుంటే 2015 తర్వాత ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ఎక్కువ ఫ్లాట్స్‌ అమ్మడైనట్టు తెలుస్తోంది.  

2 లక్షలు దాటొచ్చు..  
త్రైమాసికం వారీ విక్రయాలు 2021 క్యూ3 నుంచి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఇవి మరింత పెరిగాయి. ప్రతి త్రైమాసికంలోనూ 50,000 కంటే ఎక్కువ ఫ్లాట్స్‌ అమ్ముడయ్యాయి. ఇక పండుగుల సీజన్‌ కావడంతో ప్రస్తుత త్రైమాసికంలోనూ విక్రయాలు బలంగా నమోదు కావచ్చు. దీంతో వార్షిక అమ్మకాలు 2 లక్షల యూనిట్లను దాటిపోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు బలపడడంతో వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడింది. ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్లు చేపట్టిన ప్రాజెక్టులకు మంచి డిమాండ్‌ ఉంది’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా తన నివేదికలో పేర్కొంది.  

>
మరిన్ని వార్తలు