APEDB పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రోడ్‌ షోలు

29 Oct, 2022 14:53 IST|Sakshi

 నవంబర్‌లో ముంబై, ఢిల్లీల్లో మెట్‌ ఎక్స్‌పో, ఇండియా కెమ్‌ సమావేశాలు

వీటిలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తాం  

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరుస రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవో జి.సృజన తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలో ముంబై, ఢిల్లీల్లో నిర్వహించనున్న మెట్‌ ఎక్స్‌పో, ఇండియా కెమ్‌-2022కు అధికారులు హాజరవుతారని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారన్నారు.

ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల విధుల్లో ఉన్న సృజన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం ఈడీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీఈడీబీ రెండు కీలక రంగాలకు చెందిన అంతర్జాతీయ బిజినెస్‌ ఎక్స్‌పోల్లో భాగస్వామి అవుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్న ఇంజనీరింగ్‌–టెక్నాలజీ, కెమికల్స్‌–పెట్రో కెమికల్స్‌ రంగాలపై ముంబై, ఢిల్లీల్లో జరిగే అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొంటామని చెప్పారు. నవంబర్‌ 2 నుంచి 3 వరకు ఢిల్లీ ప్రగతి మైదాన్‌ వేదికగా ఫిక్కీ ఆధ్వర్యంలో కెమికల్స్‌–పెట్రోకెవిుకల్స్‌ రంగాలపై ‘ఇండియా కెమ్‌ –2022’’ పేరిట 11వ అంతర్జాతీయ సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో ఏపీ భాగస్వామ్య రాష్ట్రంగా చేరడంతో ప్రత్యేక స్టాల్స్, సీఈవో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, సెమినార్లలో పాల్గొనే అవకాశం లభించిందని తెలిపారు. వీటిని వినియోగించుకోవడం ద్వారా విశాఖ–కాకినాడ పెట్రోలియం, కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌)తో పాటు పీఎల్‌ఐ స్కీమ్‌ కింద రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అధికారులు వివరిస్తారన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలోని అధికారుల బృందం హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. 

డిసెంబర్‌లో రోడ్‌ షోలు
అలాగే మెటీరియల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఇండియాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే విధంగా నవంబర్‌ 2 నుంచి 4 వరకు ముంబైలో మెట్‌ ఎక్స్‌పో జరుగుతుందని సృజన వెల్లడించారు. దీనికి వివిధ రంగాలకు చెందిన 150 మందికిపైగా పారిశ్రామికవేత్తలు హాజరవుతారన్నారు. మెట్‌ ఎక్స్‌పోలో అల్ట్రాటెక్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, అక్జో నోబెల్, మహీంద్రా, టాటా స్టీల్‌ వంటి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతామని వివరించారు. డిసెంబర్‌లో తైవాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో రోడ్‌ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సృజన అధికారులను కోరారు. రాష్ట్రంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా ఈ రోడ్‌షోలను నిర్వహించనున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు