Apollo: ఇండియన్‌ ఆయిల్‌కి అపోలో షాక్‌ ! నిప్టీ 50లో మార్పులు

21 Jan, 2022 13:39 IST|Sakshi

Apollo Hospitals may replace Indian Oil: హెల్త్‌ సెక్టార్‌లో దశాబ్ధాల అనుభవం కలిగిన అపోలో హాస్పిటల్స్‌కి వైద్యపరంగా ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించింది. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో సైతం మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. 

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలో లిస్టయిన కంపెనీలను స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, లార్జ్‌ క్యాప్‌ కంపెనీలుగా పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో లార్జ్‌ క్యాప్‌ కంపెనీల్లో టాప్‌ 50 కంపెనీల షేర్ల విలువ, బదలాయింపు, ట్రేడింగ్‌లు ఎంతో కీలకం. నిత్యం వార్తల్లో  మార్కెట్‌ హెచ్చు తగ్గులకు సంబంధించి వచ్చే వార్తలు కూడా ఈ టాప్‌ 50 కంపెనీలకు సంబంధించినవే ఉంటాయి.  ఎన్‌ఎస్‌ఈ టాప్‌ 50 లిస్టులో చోటు సాధించడం ఆశామాషీ వ్యవహారం కాదు. ఇప్పుడు అపోలో హాస్పిటల్‌ ఈ ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. 

ఎడిల్‌వైజ్‌ ఆల్టర్‌రేటివ్‌ రీసెర్చ్‌ అందిస్తున్న వివరాల ప్రకారం ప్రతీ ఏడు ఫిబ్రవరి మధ్యలో ఎన్‌ఎస్‌ఈ తన టాప్‌ 50 జాబితాను సవరిస్తుంది. కంపెనీల పనితీరు, షేర్ల ట్రేడింగ్‌ ఆధారంగా కొన్ని కంపెనీలు కొత్తగా ఈ లిస్టులో చేరుతుండగా మరికొన్ని స్థానం కోల్పోతాయి. కాగా ప్రస్తుత అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో చేపట్టే సెమీ యాన్యువల్‌ ఇండెక్స్‌ రివ్యూలో అపోలోకి టాప్‌ 50 కంపెనీల జాబితాలో చోటు దక్కవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇండియన్‌ ఆయిల్‌ స్థానాన్ని అపోలో భర్తీ చేయవచ్చని ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రచురించింది.

ఇటీవల కాలంలో అపోలో హాస్పిటల్స్‌ షేర్లు మార్కెట్‌లో ఎక్కువగా ట్రేడింగ్‌ జరుగుతున్నాయి. అపోలో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ రోజు 175 మిలియన్‌ డాలర్ల ట్రేడింగ్‌ ఈ షేర్ల మీద జరుగుతోంది. వీటికి సంబంధించి రోజువారి సగటు ట్రేడింగ్‌ వాల్యూమ్‌ 1.7గా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తరలిపోతున్నాయి. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అపోలోకి టాప్‌ 50లో చోటు దక్కడం ఖాయమంటున్నారు. 

మరిన్ని వార్తలు