అపోలో హాస్పిటల్స్‌- పనాసియా బయో స్పీడ్‌

24 Sep, 2020 14:45 IST|Sakshi

సరికొత్త గరిష్టాన్ని తాకిన అపోలో హాస్పిటల్స్

గత రెండు వారాలుగా ర్యాలీ- ‌ షేరు 21 శాతం అప్‌

డెంగ్యూ నివారణ వ్యాక్సిన్‌ రెండు దశల పరీక్షలు విజయవంతం

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన పనాసియా బయోటెక్‌

మార్కెట్లు పతన బాటలో సాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలతో అపోలో హాస్పిటల్స్‌ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. మరోపక్క డెంగ్యూ వ్యాధి నివారణకు రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తొలి రెండు దశల పరీక్షలను విజయవంతంగా ముగించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ పనాసియా బయోటెక్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

అపోలో హాస్పిటల్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాలపై అశావహ అంచనాలతో అపోలో హాస్పిటల్స్‌ కౌంటర్‌ మరోసారి బలపడింది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,974ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 1,948 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1లో నిపుణులు రూ. 110 కోట్ల నష్టాన్ని అంచనా వేయగా.. అపోలో హాస్పిటల్స్‌ కేవలం రూ. 43 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లాక్‌డవున్‌ల కాలంలోనూ ఈ ఫలితాలు ప్రోత్సాహాన్నివ్వడంతో గత రెండు వారాల్లో 21 శాతం ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలియజేశారు.

పనాసియా బయోటెక్
డెంగీఆల్‌ పేరుతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ తొలి రెండు దశల పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ఫార్మా కంపెనీ పనాసియా బయోటెక్‌ తెలియజేసింది. ఈ పరీక్షలలో మొత్తం నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లకు వ్యతిరేకంగా యాంటీబాడీలు యాక్టివేట్‌ అయినట్లు వివరించింది. తద్వారా ఎలాంటి ఇతర సమస్యలూ ఎదురుకాలేదని  తెలియజేసింది. సింగిల్‌ డోసేజీ ద్వారా పరీక్షించిన 80-95 శాతం మందిలో మంచి రెస్పాన్స్‌ కనిపించినట్లు  పేర్కొంది. ఈ నేపథ్యంలో పనాసియా బయో షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 9.40 ఎగసి రూ. 198 ఎగువన ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు