గుడ్‌బై ఐపాడ్‌.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు..

11 May, 2022 12:58 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ గ్యాడ్జెట్స్‌కి ఉన్న క్రేజ్‌ వేరు. యాపిల్‌ నుంచి ఓ కొత్త ప్రొడక్టు ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా.. ఎ‍ప్పుడు సొంతం చేసుకుందామా.. అని టెక్‌ ప్రియులు ఎదురు చూస్తుంటారు. అయితే యాపిల్‌కి ఇంతటి క్రేజ్‌ రావడంలో తొలి బ్రేక్‌ త్రూ అందించింది ఐపాడ్‌ అనడం అతిశయోక్తి కాదు.

అప్పట్లో సంచలనం
మోత బరువు ఉండే వాక్‌మెన్లు రాజ్యం ఏలుతున్నా కాలంలో సింపుల్‌గా అరచేతిలో ఇమిడిపోతూ వెయ్యికి పైగా పాటలను నాన్‌స్టాప్‌గా గంటల తరబడి అందించే గ్యాడ్జెట్‌గా ఇరవై ఏళ్ల క్రితం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఐపాడ్‌. ఆ రోజుల్లో ఐపాడ్‌ ఓ టెక్నికల్‌ వండర్‌. దీన్ని సొంతం చేసుకోవడం ఓ స్టేటస్‌ సింబల్‌. ఐపాడ్‌ ఇచ్చిన క్రేజ్‌తో ఆ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం మార్కెట్‌లో వరల్డ్‌లో ఐఫోన్‌ నంబర్‌ వన్‌గా ఉందంటే అదంతా ఐపాడ్‌ చలవే.

అదంతా గతం
గడిచిన పదేళ్లలో సాంకేతిక అభివృద్ధి ఊహించని వేగంతో జరిగింది. వందల జీబీని మించిన స్టోరేజీలో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇంటర్నెట్‌ లభ్యత విరివిగా మారిన తర్వాత స్టోరేజీతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ మ్యూజిక్‌స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ పెరిగిపోయాయి. ఫలితంగా ఐపాడ్‌ అవసరం జనానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐపాడ్‌ కేవలం ఇరవై ఏళ్లకే ‘వింటేజ్‌’ జాబితాలో చేరిపోయింది.

ఇకపై..
ఐపాడ్‌కి డిమాండ్‌ తగ్గిపోయినా దీనికి ఉన్న సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కోసం ఇన్నాళ్లు యాపిల్‌ సంస్థ ఐపాడ్‌ను మార్కెట్‌లో కంటిన్యూ చేసింది. కానీ ఇలా ఎంత కాలం కొనసాగించలేమని నిర్ణయానికి వచ్చి.. తాజాగా ఐపాడ్‌ ప్రొడక‌్షన్‌ ఆపేస్తున్నట్టు.. మార్కెట్‌ నుంచి డిస్‌కంటిన్యూ చేస్తున్నట్టు యాపిల్‌ ప్రకటించింది.

చెరిగిపోని జ్ఞాపకం
యాపిల్‌ ఈ నిర్ణయం ప్రకటించడం ఆలస్యం సోషల్‌ మీడియా ఐపాడ్‌ జ్ఞాపకాలు, తీపి గుర్తులతో నిండిపోయింది. తమకు ఎంతో చక్కని అనుభూతిని అందించిన ఐపాడ్‌ జ్ఞాపకాలను ట్వీట్ల రూపంలో మెసేజ్‌ల రూపంలో, ఫోటోల రూపంలో పంచుకుంటున్నారు. 

చదవండి: యాపిల్‌ నుంచి కొత్తగా స్మార్ట్‌ బాటిల్స్‌! ధర ఎంతంటే?

మరిన్ని వార్తలు