Apple Fired Janneke Parrish: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్‌ వేటు

16 Oct, 2021 19:25 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సంస్థ ఉద్యోగులపై ఉక్కు పాదం మోతున్నట్లు తెలుస్తోంది. సంస్థలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేధింపులు, వివక్ష గురించి మాట్లాడిన ఉద్యోగుల్ని 'యు ఆర్‌ ఫైర్డ్‌' అంటూ విధుల నుంచి తొలగిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా తాజాగా ఆపిల్ మ్యాప్స్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్ మేనేజర్ జన్నెకే పారిష్‌ ను విధుల నుంచి తొలగిస్తూ నోటీసులు జారీ చేసింది. 

గత కొద్ది కాలంగా ఆపిల్‌ సంస్థలో ఉద్యోగులపై దూషణలు, పే ఈక్విటీ, వర్క్‌ ప్లేస్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఇతర సమస్యల గురించి జన్నెకే పారిష్‌ పోరాటం చేస్తున్నారు. ఆపిల్‌ సంస్థలో ఉద్యోగుల చేదు అనుభవాలు, హరాస్‌ మెంట్స్‌, వివక్ష వంటి అంశాల ఆధారంగా #AppleToo పేరుతో సోషల్‌మీడియాలో స్టోరీస్‌ను పబ్లిష్‌ చేస్తున్నారు. ఈ అంశం ఆపిల్‌ సంస్థకు తలనొప్పిగా మారింది. అదే సమయంలో జీతాలకు సంబంధించిన వ్యవహారంలో ఆపిల్‌పై ఇద్దరు ఉద్యోగులు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్‌కు ఫిర్యాదు చేశారు.  

ఈ నేపథ్యంలో ఆపిల్ సంస‍్థ ప్రోగ్రామ్ మేనేజర్ జన్నెకే పారిష్ కంపెనీకి సంబంధించిన డేటాను డీలిట్‌ చేశారని, సంస్థకు సంబంధించిన కొన్ని కీలక అంశాల్ని మీడియా కాన్ఫిరెన్స్‌లో చర్చించారని  ఆరోపిస్తూ ఆమెను విధుల నుంచి తొలగించింది.  ఈ సందర్భంగా పారిష్‌ మాట్లాడుతూ.. సంస్థలో ఉద్యోగులు ఇబ్బందుల గురించి మాట్లాడడం వల్లే తనని తొలగించారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపిల్‌పై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్‌కు ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరు ఉద్యోగులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. సంస్థ లోపాల గురించి మాట్లాడినందుకే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోగుల తొలగింపు వ్యవహారం ఆపిల్‌లో చర్చాంశనీయంగా మారింది.

చదవండి: ఈ కంపెనీలు 60సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?

మరిన్ని వార్తలు