Apple iPhone 13: యాపిల్‌పై పిడుగు, చిప్‌ కొరతతో..ఐఫోన్‌ 13 ఫోన్‌లు లేవంట..!

9 Nov, 2021 17:26 IST|Sakshi

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఇటీవల విడుదలైన క్యూ3 ఫలితాలతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యాపిల్‌ ఎన్నడు లేనంతగా ఐఫోన్‌ 13తో ఇండియన్‌ మార్కెట్‌లో సత్తచాటడంపై తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. చిప్‌ కొరత కారణంగా ఆ ప్రభావం ఐఫోన్‌ 13పై పడింది. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఐఫోన్‌ల కొరత ఏర్పడనుంది. ఈ కొరత యాపిల్‌ కు భారీ నష్టాన్ని మిగల్చనుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇటీవల మనదేశంలో స్మార్ట్‌ ఫోన్‌ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్‌, సెప్టెంబర్‌) ఫలితాలు విడుదలయ్యాయి. త్రైమాసికంలో  ఐఫోన్‌13 తో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా ఐఫోన్‌13 తో యాపిల్‌ ఇండియన్‌ మార్కెట్‌లో పట్టు సాధించిందని మార్కెట్‌ వర్గాలు అభివర్ణించాయి. దీంతో ఐఫోన్‌13ను భారత్‌లో పెద్ద ఎత్తున అమ్ముకాలు ప్రారంభించాలని టిమ్‌ కుక్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతులోనే 'డిగిటైమ్స్‌ ఏషియా' రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం..ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్‌13 సిరీస్‌ స్టాక్‌ లేవని తెలిపింది. ఫిబ్రవరిలోపు వినియోగదారులకు తగినంత ఐఫోన్‌లను అందించలేదని రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే  డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌ ఉత్పత్తులను పెంచితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి గ్లోబల్‌గా చిప్‌కొరత డిమాండ్‌ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.  

ఐఫోన్‌ 13 పై భారీ ప్రభావం
వరల్డ్‌ వైడ్‌గా టెక్నాలజీ, ఆటోమొబైల్‌తో పాటు ఇతర రంగాలు సెమీకండక్టర్‌ చిప్‌పై ఆధారపడ్డాయి. గ్లోబల్ చిప్ కొరత కారణంగా సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్13 అమ్మకాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ చిప్‌ కొరత మనదేశంలో డిమాండ్‌ ఉన్న ఐఫోన్ 13 సిరీస్ లోని  ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్ లపై పడిందని డిగిటైమ్స్‌ ఏషియా వెల్లడించింది.  కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఐఫోన్‌ 13  సిరీస్‌ ఫోన్‌లు లేవని స్పష్టం చేసింది.   

యాపిల్ కు భారీ నష్టమే 
క్యూ3 (త్రైమాసికం)లో చిప్ కొరత కారణంగా యాపిల్ సుమారు  6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో పాటు చాలా దేశాల్లో ఫెస్టివల్‌ సీజన్‌ కారణంగా పెరిగిన సేల్స్‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌లు లేకపోవడం, చిప్‌ కొరత ఏర్పడడం మరో కారణమని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు. అదే సమయంలో ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌ల కోసం యాపిల్‌ ఐపాడ్‌లతో పాటు మిగిలిన ప్రొడక్ట్‌ల  ఉత్పత్తిని తగ్గించింది. ఐఫోన్‌లకు చిప్‌లను అందించింది.

కానీ తాజాగా భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో  ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌లు తగినంత లేకపోవడం యాపిల్‌ భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు చిప్‌లు అందుబాటులో ఉంటేనే నష్టాల్ని నివారించ వచ్చనేది మరికొన్ని రిపోర్ట్‌లు నివేదికల్లో పేర్కొంటున్నాయి.  ఏది ఏమైనా చిప్‌ కొరత యాపిల్‌కు పెద్ద దెబ్బేనని, ఆటోమోటివ్ రంగంలో మహమ్మారి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఏడాది ప్రారంభం నుంచి సెమీకండక్టర్ కొరత ఏర్పడింది. 2023లోపు ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందని  ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ అన్నారు.

చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్‌13తో కళ్లకు ట్రీట్మెంట్‌

మరిన్ని వార్తలు