యాపిల్‌ జంబలకిడిపంబ: మగాడికి కడుపొస్తే.. కాంట్రవర్సీనే!

29 Jan, 2022 18:23 IST|Sakshi

Apple Brings Pregnant Man Emoji Soon To iPhones: టెక్‌ ప్రపంచంలో రోజూవారీ పనుల్ని తగ్గించేవెన్నో. అందులో సరదాగా మొదలైన ఎమోజీల వ్యవహారం.. ఇప్పుడు ఛాటింగ్‌ ప్రక్రియలో  క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జస్ట్‌ ఒక ఎమోజీతో బదులు ఇవ్వడమే కాదు.. పెద్ద పెద్ద ఉద్యమాలు సైతం నడుస్తున్న రోజులివి. కొన్నిసార్లు భావోద్వేగాలను మోతాదులో మించి ప్రదర్శిస్తున్నాయి కాబట్టే అంత ఆదరణ ఉంటోంది ఎమోజీలకు. 

కానీ, ఎమోజీలతో భావోద్వేగాలతో ఆడుకుంటే మాత్రం జనాలు ఊరుకుంటారా? యాపిల్‌ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రెగ్నెంట్‌ మ్యాన్‌’ ఎమోజీ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.  గురువారం అందించిన ఈ అప్‌డేట్‌ సడన్‌ సర్‌ప్రైజ్‌తో పాటు సీరియస్‌ డిస్కషన్‌కు తెర తీసింది ఈ ఎమోజీ. గర్భంతో ఉన్న మగవాడి ఎమోజీ ద్వారా వివక్షకు తెర తీసిందంటూ కొందరు విమర్శిస్తుండగా.. కొందరేమో ఈ ఎమోజీని సరదా కోణంలో ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ లింగ వివక్ష, మాతృత్వాన్ని దెబ్బ తీస్తుందన్న విమర్శల కోణంలో ఈ ఎమోజీపై నెగెటివిటీనే చెలరేగుతోంది సోషల్‌ మీడియాలో.  

ఐవోఎస్‌ 15.4 తాజా అప్‌డేట్‌తో ఐఫోన్‌లలో కొత్త ఎమోజీలు వచ్చాయి.  ప్రెగ్నెంట్‌ మ్యాన్‌తో పాటు పెదవి కొరికే ఎమోజీ.. మరో 35 ఎమోజీలను ఐఫోన్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం బేటా వెర్షన్‌లో ఉన్న ఈ ఎమోజీలు.. త్వరలో పూర్తిస్థాయిలో వాడుకలోకి రానున్నాయి.

కొత్తేం కాదు..
కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే తరహా ఎమోజీను విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంది ఎమోజీపీడియా. దీంతో ఆ ఎమోజీని ట్రాన్స్‌ మెన్‌, నాన్‌-బైనరీ పీపుల్‌, పొట్టి జుట్టు ఉన్న మహిళల కోసం.. ఉపయోగించొచ్చంటూ తప్పించుకునే వివరణ ఇచ్చుకుంది. అయినా విమర్శలు ఆగలేదు. ‘ఫుల్‌గా తిని కడుపు నిండిన మగవాళ్లు కూడా ఈ ఎమోజీని సరదాగా ఉపయోగించొచ్చు అంటూ ఎమోజీపీడియా జేన్‌ సోలోమన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై తిట్లు పడగా.. చివరికి తన మాటలకు క్షమాపణలు చెప్పాడు సోలోమన్‌. మరి విమర్శల నేపథ్యంలో యాపిల్‌ వెనక్కి తగ్గుతుందా? ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి!.

చదవండి: మాస్క్‌ ఉన్నా ఫేస్‌ డిటెక్ట్‌ చేసి.. లాక్‌ తీసేస్తది!

మరిన్ని వార్తలు