Apple: యాపిల్‌ తిక్క కుదిరింది.. ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లింపు

13 Nov, 2021 15:11 IST|Sakshi

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తిక్క కుదిరింది. యాపిల్‌ తన స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు కోర్టు ఉత్తర్వుల మేరకు 29.9 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.223 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం తర్వాత కోర్టులో ఉన్న ఓ వ్యవహారం కొలిక్కి రావడంతో ఉద్యోగులకు ఈ పరిహారం లభించింది. అసలు విషయానికి వస్తే.. యాపిల్‌  స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు తమ విధులు ముగించుకొని వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. అయితే, ఈ తనిఖీ ఉద్యోగులు పని సమయం ముగిసిన తర్వాత చేసేవారు. వారేమైనా బ్యాగుల వంటివి తెచ్చుకుంటే వాటిని కూడా నిశితంగా పరిశీలించేవారు.

దీని వల్ల స్టోర్ల వద్ద ఎక్కువ సమయం పట్టేది. అయితే, కంపెనీ మాత్రం ఈ సమయానికి ఎటువంటి చెల్లింపులు చేసేది కాదు. ఈ తనిఖీ చేయడానికి పట్టే సమయానికి డబ్బులు చెల్లించకపోవడం అనేది కాలిఫోర్నియా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారు. దీనిపై గళం విప్పిన ఉద్యోగులు 2013లో కోర్టును ఆశ్రయించారు కార్మికులు ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలించి తమ బ్యాగుల్లో దాచకుండా చేయడానికి బ్యాగ్ తనిఖీ అవసరమని యాపిల్‌ పేర్కొంది. ఈ పాలసీని ఇష్టపడని ఎవరైనా పనికి బ్యాగులను తీసుకురాకూడదని కోర్టులో వాదించింది. 2015లో ఒక న్యాయస్థానం ఉద్యోగుల వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కానీ, వారు మరోసారి కోర్టును ఆశ్రయించారు.

ఆ తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం కాలిఫోర్నియాలోని 52 యాపిల్‌ స్టోర్లలో కార్మికులను మాత్రమే వర్తించింది. ఈ యాపిల్‌ స్టోర్లలో 14,683 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 1,286 డాలర్లు లభిస్తాయని న్యాయవాదులు కోర్టు ఫైలింగ్ లో తెలిపారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మాట్లాడటానికి యాపిల్ నిరాకరించింది. డిసెంబర్ 2015లో ఉద్యోగులను తనిఖీ చేసే విధానాన్ని నిలిపివేసినట్లు కంపెనీ ఒప్పందంలో తెలిపింది.

(చదవండి: ఆర్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగినే బురిడీ కొట్టించిన కేటుగాడు!)

మరిన్ని వార్తలు