గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్

18 Sep, 2020 09:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే దేశీయంగా ఆపిల్ తన తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ శుక్రవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తద్వారా తమ కస్టమర్లకు మరింత  చేరువవుతున్నట్టు తెలిపారు.(ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు)

సెప్టెంబర్ 23 న భారత్‌లో తొలి స్టోర్ ను ప్రారంభించనున్నామని టిమ్ కుక్ ట్వీట్ చేశారు తమకు ఇష్టమైన వారితో, చుట్టూ ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం తమ కస్టమర్లకు ఎంత ముఖ్యమో తెలుసు. అందుకే సెప్టెంబర్ 23న ఆన్‌లైన్‌లో ఆపిల్ స్టోర్‌తో కస్టమర్లకు కనెక్ట్ అవుతున్నామన్నారు. భారతదేశంలో విస్తరిస్తున్నందుకు గర్వంగా ఉందని, యూజర్లకు మద్దతు, సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్ అన్నారు. ఆపిల్ స్పెషలిస్టుల ద్వారా వినియోగదారులు సలహాలు పొందవచ్చని, కొత్త ఆపిల్ ఉత్పత్తులపై ఇంగ్లీష్, హిందీ ఇతర భాషలలో తెలుసుకోవచ్చని హామీ ఇచ్చారు. కస్లమర్ల సౌలభ్యంకోసం చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నామన్నారు. 

మాక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసే విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుందని పేర్కొంది. అలాగే ఆపిల్ ఇతర యాక్ససరీస్, కేర్ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు ఈ పండుగ సీజన్లో, ఆపిల్ సిగ్నేచర్ గిఫ్ట్ ర్యాప్, ఎంచుకున్నఉత్పత్తులపై స్పెషల్ ఎంగ్రేవింగ్ సదుపాయం కూడా అందించనుంది. ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు భాషలలో ఎమోజీ లేదా టెక్స్ట్ చేసుకోవచ్చు.  ఆపిల్ ఎయిర్ పాడ్,  ఐప్యాడ్  లో ఆపిల్ పెన్సిల్  ఫీచర్ అందిస్తున్నట్టు ఆపిల్ పత్రికా ప్రకటనలో తెలిపింది. కాగా ఇటీవల నిర్వహించిన ఆపిల్ ఈవెంట్ లో సంస్థ వాచ్ సిరీస్. ఐప్యాడ్స్,  కొత్త ఆపరేటింగ్ సిస్టంను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు