యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ : బంపర్ ఆఫర్లు

23 Sep, 2020 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఐఫోన్ తయారీదారు, టెక్ దిగ్గజం  యాపిల్  ఇండియాలో తొలి ఆన్‌లైన్ స్టోర్ ను బుధవారం ప్రారంభించిన సంగతి  తెలిసిందే. ఈ సందర్భంగా వినియోగదారులకు డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ తో పాటు, పరిమిత కాలానికి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఎంపిక చేసిన కొనుగోళ్లపై వినియోగదారులు ఆరు శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ గరిష్టంగా10,000 రూపాయలు. ఐదు నుండి ఏడు రోజుల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే క్యాష్‌బ్యాక్ పొందాలంటే కనీస కొనుగోలు విలువ 20,900 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి.  (యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ వచ్చేసింది : విశేషాలు)

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల లావాదేవీలలోమాత్రమే ఈ ఆఫర్ లభ్యం. ఒక ఆర్డర్‌కు పరిమితమైన ఈ ఆఫర్ అక్టోబర్16 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీబ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బిసి, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జె అండ్ కె బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఇది లభ్యం. దీంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఆరు నెలల కాలానికి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. 

అంతేకాదు పాత ఐఫోన్ అమ్మకం ద్వారా కొత్త ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. బ్రాండ్, మోడల్, కండిషన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఆన్‌లైన్ ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత ట్రేడ్-ఇన్ క్రెడిట్‌ను సర్దుబాటుతో కొత్త ఐఫోన్ ధరను తగ్గిస్తుంది. వీటితోపాటు శాంసంగ్, గెలాక్సీ ఎస్10, వన్‌ప్లస్ 6టీ లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా క్రెడిట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మాక్, వాచ్, యాపిల్ టీవీలతోపాటు,  ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 11,  ఐఫోన్ ఎస్‌ఈ,  ఐఫోన్ ఎక్స్‌ఆర్ తదితరాలను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వార్తలు