మీకు హార్ట్‌ ఎటాక్‌ వ‌చ్చింది చూసుకోండి!

21 Nov, 2022 19:29 IST|Sakshi

మనిషి రోజు వారీ జీవితంలో టెక్నాలజీ భాగమైపోయింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే, అది మనం ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఉపయోగిస్తే అది మనిషి ప్రాణాలను సైతం కాపాడుతుందనడానికి స్మార్ట్‌ వాచ్‌లు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్య‌ధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా యాపిల్ అరుదైన ఘ‌న‌త సాధించింది.
  
సాధారణంగా గుండె ఎడమ జఠరిక పనిచేయకపోవడం వల్ల హృద్రోగ (గుండె సంబంధిత) సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ వాటిని గుర్తించడంలోనే అలస్యం ఏర్పడి కొన్ని సార్లు గుండె పోటు వస్తుంది.సరైన సమయంలో ట్రీట్మెంట్‌ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ తరహా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి యాపిల్‌ వాచ్‌ అలెర్ట్‌ ఇస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.  

మాయో క్లినిక్ రీసెర్చ్‌ ప్రకారం..అమెరికాతో పాటు 11 ఇతర దేశాలకు చెందిన 2,454 మంది హృద్రోగులపై ఆగస్టు 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పరిశోధనల్లో జరిగాయి. ఇందులో భాగంగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఏఐ అల్గారిదంతో యాపిల్‌ వాచ్ ద్వారా 1,25,000 ఈసీజీ (Electrocardiography) టెస్ట్‌లను చేయగా సత్ఫలితాలు నమోదైనట్లు రీసెర్చర్లు తెలిపారు. 

సరైన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాల్లో ఈసీజీ టెస్ట్‌లతో యాపిల్‌ వాచ్ గుండె సంబంధిత బాధితుల్ని గుర్తిస్తాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, భవిష్యత్‌లో యాపిల్‌ వాచ్‌ ద్వారా హార్ట్‌ ఎటాక్‌తో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలు గుర్తించి యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు మనుషుల ప్రాణాలు కాపాడేలా వైద్య చరిత్రలో అరుదైన అద్భుతాలు జరుగుతాయని మాయో రీసెర్చర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్‌ వాచ్‌ నా ప్రాణం కాపాడింది సార్‌’

మరిన్ని వార్తలు