భారత్‌లో ఐఫోన్‌ అమ్మకాలు అదరగొట్టేస‍్తున్నాయ్‌, రూ.10వేల కోట్లకు యాపిల్‌ ఎగుమతులు!

21 Mar, 2022 08:41 IST|Sakshi

ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్‌ భారత్‌ టెక్‌ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. దేశంలో యాపిల్‌ ఐఫోన్‌ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడంతో, ఆఫోన్‌ల అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయి. దీంతో దేశీయంగా యాపిల్‌ ప్రొడక్ట్‌లకు డిమాండ్‌ పెరిగింది. అందుకే ఇక్కడ తయారు చేస్తున్న ఆ సంస్థ ఉత్పత్తుల ఎగుమతుల విలువ ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022కి రూ.10వేల కోట్లకు చేరనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   
 

సంవత్సరంలోనే.. 
కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా దేశంలో తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్‌ను  ప్రవేశ  పెట్టింది. ఈ పథకంలో ఎంపికైన సంస్థలకు ప్రత్యేక రాయితీలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో యాపిల్‌ ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు పరిశ‍్రమల్ని స్థాపించేందుకు పీఎల్‌ఐ స్కీమ్‌కు అప్లయి చేసింది. ఇందులో యాపిల్‌ ఐఫోన్‌లను విస్ట్రాన్‌, ఫాక్స్‌కాన్,పెగాట్రాన్ లు ఎంపికయ్యాయి. 

విస్ట్రాన్ కర్ణాటకలో ఉండగా, ఫాక్స్‌కాన్ తమిళనాడులో 
కర్ణాటకలో విస్ట్రాన్‌ కంపెనీ ఐఫోన్ మోడల్‌లు ఎస్‌ఈ 2020లను తయారు చేస్తుండగా..తమిళనాడులో ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ 11,ఐఫోన్‌12, ఐఫోన్‌13లను తయారు చేస్తుంది. పెగాట్రాన్ సైతం ఏప్రిల్1 నుంచి దేశీయంగా ఐఫోన్‌ల తయారీ కార్యాకలాపాల్ని ప్రారంభించనుంది. అయితే పీఎల్‌ఐ స్కీమ్‌లో భాగంగా ఉత్పత్తిని ప్రారంభించిన తొలి ఏడాది యాపిల్‌ సంస్థ కేవలం 10నుంచి 15శాతం ఉత్పత్తి చేసింది. అనూహ్యంగా దేశీయ మార్కెట్‌లో ఐఫోన్‌13తో పాటు ఇతర ఐఫోన్‌ సిరీస్‌ ఫోన్‌లతో పాటు ఇతర ప్రొడక్ట్‌ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. దీంతో ఉత్పత్తుల శాతం గణనీయంగా పెరిగి..75 నుంచి 80శాతం ఉత్పత్తి చేసింది.ఈ ఉత్పత్తుల మార్కెట్‌ విలువ 10వేలకోట్లకు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు.

చదవండి: చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్‌ కుక్‌కు థ్యాంక్స్‌!

మరిన్ని వార్తలు