పండుగ విక్రయాలపై భారీ ఆశలు

4 Oct, 2022 04:06 IST|Sakshi

35 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చు

రూ.75,000 కోట్లుగా ఉండొచ్చు

కన్జ్యూమర్‌ అప్లయన్సెస్‌ కంపెనీల అంచనా

న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ కంపెనీలు ఈ విడత పండుగల విక్రయాలపై మంచి సానుకూల అంచనాలతో ఉన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల కాలంలో విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 35 శాతం మేర పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగడాన్ని సానుకూలంగా చూస్తున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నాయి.

ప్యానాసోనిక్, ఎల్‌జీ సోనీ, శామ్‌సంగ్, హయ్యర్, గోద్రేజ్‌ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్, బీఎస్‌హెచ్‌ హోమ్‌ అప్లయన్సెస్‌ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. క్రితం ఏడాది విక్రయాలపై కరెనా రెండో విడత తదనంతర పరిణామాలు ప్రభావం చూపించడం గమనార్హం. కంపెనీల ఏడాది పాటు విక్రయాల్లో 35 శాతం వరకు ఓనమ్‌ నుంచి దీపావళి మధ్యే నమోదవుతుంటాయి. ఈ విడత పండుగల సీజన్‌లో రూ.75,000 కోట్ల విక్రయాలు నమోదు కావచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది.

పథకాలు, ఆఫర్లు..
పండుగల సమయాల్లో విక్రయాలు పెంచుకునేందుకు అప్లయన్సెస్‌ కంపెనీలు మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు వారంటీ, సులభంగా చెల్లించే ఈఎంఐ పథకాలను ఆఫర్‌ చేస్తున్నాయి. చిన్న పట్టణాల నుంచి ఆరంభ స్థాయి మాస్‌ ఉత్పత్తుల విక్రయాల విషయంలో కంపెనీలు కొంత ఆందోళనతోఉన్నాయి. ఎందుకంటే ఇంకా చిన్న పట్టణాల్లో విచక్షణారహిత వినియోగం పుంజుకోలేదు. అలాగే, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు నెలకొనడం, ఉత్పత్తుల ధరలను 7–8 శాతం మేర పెంచడం విక్రయాలపై ప్రభావం చూపుతుందా? అని కంపెనీలు సందేహంతో ఉన్నాయి.  

బెడిసి కొట్టదుగా..?
‘‘వర్షపాతం దేశవ్యాప్తంగా ఎలా నమోదైందన్నది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. ప్రీమియం ఉత్పత్తుల విభాగం ఎప్పటి మాదిరే మంచి వృద్ధిని చూస్తోంది. కానీ, మాస్‌ (తక్కువ, మధ్య స్థాయి) ఉత్పత్తుల అమ్మకాలపైనే మాలో ఆందోళన ఉంది’’అని గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలిపారు. ఈ పండుగల సీజన్‌లో స్మార్ట్‌ ఏసీలు, పెద్ద సైజు తెరల టీవీలు, గృహోపరణాలు డబుల్‌ డిజిట్‌ విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నట్టు ప్యానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా చైర్మన్‌ మనీష్‌ శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు నేడు తమ ఎంపికల విషయంలో స్పృహతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.

వినియోగ డిమాండ్‌ పుంజుకుంటుందని, పండుగల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజ తెలిపారు. పండుగల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్‌ నాయర్‌ వెల్లడించారు. ఎల్‌జీ ఇండియా పండుగల డిమాండ్‌కు అనుకూలంగా మలుచుకుని, విక్రయాలు పెంచుకునేందుకు కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కరోనా ముందుకంటే అధిక విక్రయాలను నమోదు చేస్తామన్న నమ్మకాన్ని ఎల్‌జీ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ బన్సాల్‌ వ్యక్తం చేశారు. పండుగల విక్రయాలు ఓనమ్, వినాయక చవితి సందర్భంగా సానుకూలంగా ఉన్నట్టు శామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. 55 అంగుళాలు అంతకుమించి సైజు టీవీలు, 300కు పైగా లీటర్ల సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, 8కేజీలు, అంతకంటే పెద్ద వాషింగ్‌ మెషిన్లకు డిమాండ్‌ ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు