పాస్‌ పోర్ట్‌ కోసం అప్లయ్‌ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త

28 Sep, 2022 16:54 IST|Sakshi

పాస్‌ పోర్ట్‌ కోసం అప్లయ్‌ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌ల కోసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు వారి ఇంటి అడ్రస్‌ ప్రకారం..స్థానిక పోలీస్ స్టేషన్‌ల ద్వారా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం, టెంపరరీ వీసా, పర్మినెంట్‌ రెసిడెన్షియల్‌ (పీఆర్‌) లేదా విదేశాలకు ఇమ్మిగ్రేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా సర్టిఫికేట్ అవసరం. ఇంతకు ముందు, విదేశాల్లో నివసించే వారి విషయంలో ప్రభుత్వ పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ లేదా, ఇండియన్ ఎంబసీ/హైకమిషన్ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో పీసీసీ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు, పాస్‌పోర్ట్ సంబంధిత సేవల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్రం అన్ని ఆన్‌లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల వద్ద పీసీసీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం..పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ల కోసం ధరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారి సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతకుముందు  పీసీసీ అపాయింట్‌మెంట్ స్లాట్‌ల లభ్యతను కూడా మెరుగుపరుస్తామని ప్రకటన చేయగా.. తాజాగా పీసీసీపై ప్రకటన చేయడం పట్ల పాస్‌పోర్ట్‌ ధర ఖాస్తు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

428 పీసీసీ కేంద్రాలు
పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖల చొరవతో పౌరులకు పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని అందనున్నాయి.కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 428 ఆన్‌లైన్ పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు