ఎకానమీ సూచీలన్నీ ‘ఏప్రిల్‌’ ఫూల్‌!

20 May, 2021 00:13 IST|Sakshi

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక

బేస్‌ ఎఫెక్ట్‌ మాయలో గణాంకాలు ఉన్నాయని వ్యాఖ్య

నిజానికి వినియోగ ధోరణి బలహీనంగా ఉందని విశ్లేషణ

భారీ ఆరోగ్య, ఇంధన బిల్లులతో ఇతర వ్యయాల కోత తప్పదన్న అభిప్రాయం

ముంబై: ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఏప్రిల్‌ సూచీలన్నీ మోసపూరితమైనవేనని రేటింగ్‌ ఏజెన్సీ– ఇక్రా వ్యాఖ్యానించింది. ఇవి బేస్‌ ఎఫెక్ట్‌ మాయలో ఉన్నాయని పేర్కొంది. నిజానికి కరోనా సెకండ్‌ వేవ్‌ సవాళ్ల నేపథ్యంలో వినియోగ సెంటిమెంట్‌ భారీగా పడిపోయిందని విశ్లేషించింది. ‘పోల్చుతున్న నెల లో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదు కావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడం బేస్‌ ఎఫెక్ట్‌గా పేర్కొంటారు. ఇక్రా తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. 

►బేస్‌ ఎఫెక్ట్‌ వల్ల పలు రంగాలు ఏప్రిల్‌లో వృద్ధి శాతాల్లో భారీగా నమోదయినట్లు కనబడుతున్నప్పటికీ, నిజానికి ఆయా రంగాల తీరు ఆందోళనకరంగానే ఉంది.  
►ప్రత్యేకించి వినియోగ సెంటిమెంట్‌ భారీగా దెబ్బతింది. భారీగా పెరిగిన ఆరోగ్య, ఇంధన బిల్లుల వల్ల  ఇతర వ్యయాలవైపు వినియోగదారుడు తక్షణం దృష్టి సారించే అవకాశం లేదు. పలు సేవలపై వ్యయాలను భారీగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.  
►2021 ఏప్రిల్‌లో 13 నాన్‌ ఫైనాన్షియల్‌ ఇండికేటర్లు 2019 ఏప్రిల్‌తో పోల్చితే ఎంతో బలహీనంగా ఉన్నాయి. జీఎస్‌టీ ఈ–బే బిల్లులు, ఎలక్ట్రిసిటీ జనరేషన్, వెహికల్‌ రిజిస్ట్రేషన్, రైల్వే రవాణా ట్రాఫిక్, దేశీయ విమాన ప్రయాణాలు,  ఆటో ఉత్పత్తి, పెట్రోల్, డీజిల్‌ వినియోగం, కోల్‌ ఇండియా బొగ్గు ఉత్పత్తి వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.  
►పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమలు  నేపథ్యంలో మే నెలలో పరిస్థితి కూడా ఏప్రిల్‌ తరహాలోనే కొనసాగే అవకాశం ఉంది.
►కాగా 2021 మార్చితో పోల్చి ఏప్రిల్‌ను పరిశీలిస్తే, 15 హై ఫ్రీక్వెన్సీ సూచీలు (బ్యాంక్‌ డిపాజిట్లు మినహా) వార్షిక పనితీరు బాగుంది. లో బేస్‌ దీనికి ప్రధాన కారణంగా ఉంది. ఆటోమొబైల్స్‌ ఉత్పత్తి, వాహన రిజిస్ట్రేషన్లు, నాన్‌–ఆయిల్‌ సంబంధ ఉత్పత్తుల ఎగుమతులు, జీఎస్‌టీ ఈ–వే బిల్లులు ఇందులో ఉన్నాయి.  
►ఏప్రిల్‌ నెల్లో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్ల  చరిత్రాత్మక రికార్డు ఒక మినహాయింపు.  కమోడిటీ ధరల్లో పెరుగుదల, దీనితో ముడి పదార్ఘాల వ్యయ భారాలు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రికార్డు వసూళ్లకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆదాయాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ మార్కె ట్‌ రుణ సమీకరణలు మరింత పెరిగే వీలుంది.  

దీర్ఘకాలిక ప్రభావం.. 
సెకండ్‌ వేవ్‌లో రోజూవారీ కేసుల సంఖ్య ఇంకా తీవ్రంగానే కొనసాగుతూనే ఉంది. ఇది వినియోగదారు సెంటిమెంట్‌పై దీర్ఘకాలింగా ప్రభావం చూపుతూనే ఉంటుంది. భారీగా పెరిగిన ఆరోగ్య, ఇంధన బిల్లులు...  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇతర వ్యయాల కట్టడికి దారితీస్తాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్ల వంటి పలు కన్జూమర్‌ డ్యూరబుల్స్‌పై వ్యయాలు సమీప కాలంలో పరిమితంగా ఉంటాయి. ప్రత్యక్ష సేవల రంగాలపై వ్యయాలు తగ్గుయాయి.  
– అదితి నాయర్, ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌

మొదటి వేవ్‌లో 80 శాతం ఆదాయ నష్టం ప్రైవేటుదే! 
భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదిక పేర్కొంది. దీనిలో ప్రత్యేకంగా కుటుంబాల ఆదాయ నష్టాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. కాగా, ఇతర దేశాల విషయంలో ఆర్థిక నష్టం పూర్తిగా ప్రభుత్వాలే భరించాయని విశ్లేషించింది. జీడీపీలో దాదాపు 10 శాతంగా పేర్కొంటూ రూ.21 లక్షల కోట్ల ప్యాకేజ్‌ని కేంద్రం ప్రకటించినప్పటికీ, నిజానికి లభించిన మద్దతు కేవలం జీడీపీలో 2 శాతమేనని తెలిపింది. మిగిలినదంతా రుణ రూపంలో సమకూర్చినదేనని తెలిపింది. జరిగిన నష్టం మొత్తాన్ని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో ప్రభుత్వాలు భరిస్తే, 20 శాతం నుంచి 60 శాతం నష్టాన్ని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్‌లు భరించాయని పేర్కొంది. వర్థమాన దేశాల్లో కేవలం దక్షిణాఫ్రికా మాత్రం మొత్తం నష్టాన్ని భరించిందని తెలిపింది.  
కుటుంబ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కీలకం.. 
భారత్‌లో మొదటి వేవ్‌ జరిగిన ఆర్థిక నష్టంలో కార్పొరేట్‌ రంగానికి కేవలం 12 నుంచి 16 శాతమని, మిగిలినది కుటుంబాలు భరించాయని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి నుంచి కుటుంబాలను గట్టెక్కించాలంటే కుటుంబాలకు ఉపాధి హామీ, ప్రత్యక్ష నగదు బదలాయింపులు కీలకమని పేర్కొంది. ‘హౌస్‌హోల్డ్‌ సెక్టార్‌ పటిష్టంగా లేకపోతే, మహమ్మారి అనంతరం భారత్‌ పటిష్ట వృద్ధి సాధించడం కష్టసాధ్యం’ అని విశ్లేషించింది. 

బేస్‌ మాయలో కొన్ని గణాంకాలు
►2020–21 ఆర్థిక సంవత్సరంలో క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో... 2021–22లో ఎకానమీ 8 నుంచి 10 శాతం వరకూ వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇది బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావం.  
►ఏప్రిల్‌ నెల్లో ఎగుమతులు, దిగుమతులు శాతాల్లో చూస్తే, వరుసగా 195.72%, 167% పెరిగాయి. లోబేస్‌ దీనికి ప్రధాన కారణం.  
►భారత పారిశ్రామిక రంగం ఉత్పత్తి  సూచీ (ఐఐపీ) మార్చిలో భారీగా 22.4 శాతం వృద్ధిని (2020 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. బేస్‌ ఎఫెక్ట్‌ దీనికి ప్రధాన కారణం. 
►ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌  2021 మార్చి ఉత్పత్తి వృద్ధి రేటు  భారీగా 6.8 శాతంగా నమోదయ్యింది. గడచిన 32 నెలల్లో ఇంత స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి.  2020 మార్చి నెలలో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధి నమెదుకాకపోగా ఏకంగా 8.6 శాతం క్షీణత నమోదయ్యింది. 
►ఇక ఏప్రిల్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.29 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది.  గడచిన మూడు నెలల ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. దీనికి కూడా 2020 ‘హై బేస్‌ ఎఫెక్ట్‌’ కారణం. 

>
మరిన్ని వార్తలు