పసిడి దిగుమతులు జూమ్‌..

18 Oct, 2021 06:29 IST|Sakshi

ఏప్రిల్‌–సెప్టెంబర్ మధ్యలో 24 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ – సెప్టెంబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 24 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో బంగారం దిగుమతుల విలువ సుమారు 6.8 బిలియన్‌ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నెలవారీగా చూస్తే గతేడాది సెపె్టంబర్‌లో 601.4 మిలియన్‌ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెపె్టంబర్‌లో 5.11 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ మధ్య కాలంలో వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

అయితే, కేవలం సెప్టెంబర్‌ నెలే పరిగణనలోకి తీసుకుంటే 9.23 మిలియన్‌ డాలర్ల నుంచి 552.33 మిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు ఎగియడంతో దేశ వాణిజ్య లోటు సెప్టెంబర్ లో (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 2.96 బిలియన్‌ డాలర్ల నుంచి 22.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారత్‌ ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పండుగ సీజన్, భారీ డిమాండ్‌ తదితర అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్‌ కొలిన్‌ షా తెలిపారు.

మరిన్ని వార్తలు