ఉత్తమ్‌ గాల్వా ఎవరి పరం?

5 Jan, 2021 03:14 IST|Sakshi

గత నెలలో ముగిసిన టేకోవర్‌ బిడ్‌లు 

టేకోవర్‌ రేసులో ఆర్సెలర్‌ ముందంజ

జిందాల్, వేదాంత బిడ్‌లు కూడా!

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీని టేకోవర్‌ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో  ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్‌ బిడ్‌లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్‌ స్పెషల్‌ స్టోరీ...

ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీ టేకోవర్‌ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.  లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్‌ సోదరులు(సజ్జన్, నవీన్‌ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్‌ అగర్వాల్‌ ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీని టేకోవర్‌ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్‌ఎల్‌ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్‌ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్‌ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్‌ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్‌అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఏఆర్‌సీ) కూడా ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్‌ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి.  

విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు...
ఉత్తమ్‌ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి  తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్‌బీఐ పిటీషన్‌ను ఎన్‌సీఎల్‌టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్‌డీఎస్‌ అండ్‌ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్‌ కసోద్కర్‌ను నియమించింది.

అగ్ర భాగంలో ఆర్సెలర్‌ మిట్టల్‌...
ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీ టేకోవర్‌ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్‌ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్‌ కంపెనీయే. ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్‌ మిట్టల్‌ సంస్థల(ఆర్సెలర్‌ మిట్టల్‌ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్‌ లగ్జెంబర్గ్‌) వాటాలే  రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్‌ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2%   వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్‌ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్‌ మిట్టల్‌ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌ నుంచి ఆర్సెలర్‌ మిట్టల్‌ వైదొలగింది. ఎస్సార్‌ స్టీల్‌ను  టేకోవర్‌ చేసి ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌  స్టీల్‌ ఇండియాగా పేరు మార్చింది.

మరిన్ని వార్తలు