ఆర్కియన్‌ కెమ్‌ ఐపీవో సక్సెస్‌

12 Nov, 2022 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్‌ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. రూ. 386–407 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 32 రెట్లు అధిక స్పందన లభించింది. కంపెనీ 1.99 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 64.31 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి 49 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 15 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. 11న ముగిసిన ఇష్యూ ద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమకూర్చుకుంది. 

సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించారు. తాజా ఈక్విటీ నిధులను కంపెనీ జారీ ఎన్‌సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా బ్రోమైన్, ఇండస్ట్రియల్‌ సాల్ట్, పొటాష్‌ సల్ఫేట్‌ తయారీతోపాటు, ఎగుమతులను సైతం చేపడుతోంది.  

మరిన్ని వార్తలు