KTR: ‘మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్‌’!

24 May, 2022 16:16 IST|Sakshi

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో టీమ్‌ తెలంగాణ దూసుకుపోతుంది. తెలంగాణ తరఫున రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యదక్షతలో కేటీఆర్‌ చూపిస్తున​ చొరవ, ఆయనకున్న విజన్‌ను కొనియాడుతూ ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ ఆశా జడేజా మోత్వాని ట్విటర్‌లో ప్రశంసలు కురిపించారు.

మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేసిన మోత్వాని... రాబోయే ఇరవై ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్‌ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్‌ తరహాలో ఆలోచనల్లో స్పష్టత, దాన్ని అర్థమయ్యేలా విడమరిచి చెప్పగలిగే కళ ఉన్న యువ రాజకీయ నేతలను నేను ఇప్పటి వరకు చూడలేదన్నారు. దావోస్‌లో తెలంగాణ టీమ్‌ దుమ్ము రేపుతోంది. వాళ్లను చూస్తుంటే ఈ రోజు బిలియన్‌ డాలర్ల వ్యవస్థగా విస్తరించిన సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న రోజులు గుర్తుకు వస్తు‍న్నాయంటూ ఆమె పేర్కొన్నారు.

ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ ఆశా జడేజా మోత్వాని కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అనేక మంది కేటీఆర్‌ పనితీరును ఆయన విజన్‌ను మెచ్చుకుంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. మోత్వాని ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తున్నారు. ఆశా జడేజా విషయానికి వస్తే ఆమె 2000లో సిలికాన్‌ వ్యాలీలో స్టార్టప్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200లకు పైగా టెక్‌ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆమె చేపడుతున్నారు.

చదవండి: త్వరలో హైదరాబాద్‌ వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం..

మరిన్ని వార్తలు