అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు!

16 Jun, 2022 17:47 IST|Sakshi

ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ భారత్‌పే మాజీ సీఈవో అశ్నీర్‌ గ్రోవర్‌ స్టార్టప్‌ వరల్డ్‌లో మరోసారి హాట్‌ టాపిగ్గా మారారు. బడాయి మాటలు..కక్కుర్తి పనులతో కొని తెచ్చుకున్న కష్టాల నుంచి తేరుకొని ఇప్పుడు మరో సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మిలియన్‌ డాలర్లు పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు.
 

అశ్నీర్‌ గ్రోవర్‌ పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌పే ఫౌండర్‌గా, అతని భార్య మాధురి జైన్‌ కంట్రోల్స్‌ ఆఫ్‌ హెడ్‌ హోదాలో అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంస్థ సొమ్ముతో వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. భోగ భాగ్యాలు అనుభవించారు. కోటి రూపాయలు డైనింగ్‌ టేబుల్‌, మూడున్నర కోట్ల కారు ఉందంటూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నారు. చివరికి చేసిన పాపం ఊరికే పోదన్నట్లు మహీంద్రా కోటక్‌ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించారు. సంబంధిత ఆడియో సంభాషణలు వెలుగులోకి రావడంతో అశ్నీర్‌ కథ అడ్డం తిరిగింది. చివరికి సంస్థ నుంచి బలవంతంగా బయటకు నెట్టేయించుకునే పరిస్థితికి దిగజారారు.  

అయినా సరే ఇప్పుడు మరో స్టార్టప్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. అశ్నీర్‌ తన 40వ బర్త్‌ డే సందర్భంగా స్టార్టప్‌ను యూనికార్న్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఇందుకోసం అమెరికాలో తన కుటుంబానికి చెందిన ఓ సంస్థతో పాటు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో సంప్రదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అశ్నీర్‌ మాత్రం భారత్‌పేలో అమ్మిన తన వాటాతో బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు మరికొన్ని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. మరోవైపు అశ్నీర్‌ ఫిన్‌టెక్‌ సంస్థను నెలకొల్పుతారా? లేదంటే ఇతర రంగానికి చెందిన స్టార్టప్‌ను ప్రారంభిస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

చదవండి👉చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్‌ అయిపోయింది!

మరిన్ని వార్తలు