‘ఇలా వేధించడం తగదు’.. కేంద్రంపై అశ్నీర్‌ ఆగ్రహం

27 Sep, 2023 14:01 IST|Sakshi

ప్రముఖ ఫాంటసీ గేమింగ్‌ యాప్‌ ‘క్రిక్‌పే’ ఫౌండర్‌ అశ్నీర్‌ గ్రోవర్‌ ట్యాక్స్‌ ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బకాయల పేరుతో వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. 

ఇటీవల డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) విభాగం ఆన్‌లైన్‌ రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్‌ జనరల్‌ గట్టి షాకిచ్చింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్‌ఎంజీ కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారిచేసింది. ఆ నోటీసులపై అశ్నీర్‌ గ్రోవర్‌ స్పందించారు. 

డీజీజీఐ విభాగాన్ని నిర్వహిస్తున్న వారి లక్ష్యం కేవలం వ్యాపారస్తులను వేధించడమే’ అని అన్నారు. షోకాజ్‌ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రజలు భారీ పన్నులు చెల్లించరని, ప్రభుత్వం సైతం చెల్లించదు..కేవలం వాటిని సేకరించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ అలా.. బీజేపీ ఇలా
దీనిని 'రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్' (గత లావాదేవీలకు వర్తించే విధంగా) అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ వోడాఫోన్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధించగా, బీజేపీ గేమింగ్ జీఎస్టీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ దృక్పథానికి సహాయం చేయదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

జీఎస్టీ నిర్ణయంపై అసంతృప్తి 
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్‌పై 28 శాతం వస్తు సేవల పన్ను విధిస్తూ  గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్‌టి) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రోవర్‌ తప్పుబట్టారు. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల కొత్త గేమ్‌లలో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని, ట్రాన్సాక్షన్‌లు, అలాగే వ్యాపార విస్తరణపై ప్రభావం చూపుతుందన్నారు. . 
 
అశ్నీర్‌ గ్రోవర్‌ ఏం చేస్తున్నారు?
భారత్‌ పే కో-ఫౌండర్‌గా ఆ సంస్థలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్‌ గ్రోవర్‌, ఆయన భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అశ్నీర్‌ను, ఆయన భార్యను భారత్‌ పే బోర్డ్‌ యాజమాన్యం ఆ సంస్థ నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ ఏడాది క్రిక్‌పే పేరుతో సొంత ఫాంటసీ గేమింగ్‌ సంస్థను ప్రారంభించారు.

మరిన్ని వార్తలు