స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు

14 Jun, 2022 06:33 IST|Sakshi

ఏటా రూ.50 కోట్ల పెట్టుబడులు మంత్రి అశ్వని వైష్ణవ్‌

న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది ఉండదని స్పష్టం చేస్తూ.. మేథో సంపత్తి హక్కులు ఆయా ఆవిష్కరణదారులకే (స్టార్టప్‌ సంస్థలకు) ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్‌ రైల్వే ఆవిష్కరణల విధానం కింద.. రైల్వే శాఖ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతుందని, దీని ద్వారా వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను వారి నుంచి నేరుగా పొందొచ్చని మంత్రి తెలిపారు.

వినూత్నమైన సాంకేతిక పరిష్కారాలకు రూ.1.5 కోట్లను సీడ్‌ ఫండ్‌గా అందించనున్నట్టు చెప్పారు.  నిధుల మద్దతును రెట్టింపు చేస్తామని, విజయవంతంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తి లేదా టెక్నాలజీని అమల్లో పెడతామని వివరించారు. ఆవిష్కర్తలు, రైల్వే 50:50 నిష్పత్తిలో వ్యయాలు భరించేలా ఈ పథకం ఉంటుందన్నారు. స్టార్టప్‌ ల ఆవిష్కరణ, అభివృద్ధి దశలో రైల్వే ఫీల్డ్‌ ఆఫీసర్లు, ఆర్‌డీఎస్‌వో, జోనల్, రైల్వే బోర్డు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందుతుందని వైష్ణవ్‌ తెలిపారు. పారదర్శక విధానంలో స్టార్టప్‌ల ఎంపిక ఉంటుందని, ఇందు కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్‌ ఇండియన్‌ రైల్వేస్‌ పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు