దేశంలో విద్యుత్‌ కష్టాలు పోవాలంటే..ఈ పనిచేయాల్సిందే!

27 Apr, 2022 08:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌ కష్టాలు ప్రత్యేకించి వేసవి కాలంలో తొలగిపోవాలంటే బొగ్గు సుంకం రహిత దిగుమతికి అనుమతించాలని పారిశ్రామిక సంస్థ– అసోచామ్‌ స్పష్టం చేసింది. దీనితోపాటు బొగ్గు  రవాణా చేయడానికి రైల్వే రేక్‌ల లభ్యత భారీగా పెరగాలని, క్యాప్టివ్‌ జనరేటర్లకు డీజిల్‌ వేర్వేరు ధరలకు లభ్యమయ్యేలా చూడాలని కోరింది. అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు... 

► విద్యుత్‌ సరఫరాలో వాణిజ్య వినియోగదారులతో విభేదాలు లేకుండా చూసుకోవాలని మేము రాష్ట్రాలు, డిస్కమ్‌లను కోరతాము. ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం ఆర్థిక పునరుద్ధరణ ఉన్నప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ఇంకా మందగమనంలోనే ఉంది.  

► ప్రపంచ సరఫరా పరిమితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే కంపెనీలు, డిస్కమ్‌లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

ప్రస్తుతం బొగ్గుపై దిగుమతి సుంకం 2.5 శాతం ఉన్నప్పటికీ, ఒత్తిడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సుంకాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము. 

భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి ప్రధానంగా బొగ్గు దిగుమతి అవుతోంది. ఇటీవల ఆ దేశంతో భారత్‌కు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశ మధ్య, దీర్ఘకాలిక బొగ్గు సరఫరాల సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని భావిస్తున్నాం. తగిన బొగ్గు సరఫరాలు దేశంలో సకాలంలో అందేలా చర్యలు అవసరం.  

అనేక రాష్ట్రాలు విద్యుత్‌ కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే అదనపు సాధారణ హీట్‌వేవ్‌ వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.  

వర్షాలకు ఇంకా చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి.  విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కేంద్ర,  రాష్ట్రాలు, పరిశ్రమలు సంయుక్తంగా నిరంతరం పర్యవేక్షణతో పరిస్థితిని నిర్వహించాల్సిన ఉంటుంది. 

ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై అసోచామ్‌ ఇప్పటికే సభ్యులపై సంప్రతింపులు జరిపింది. ఆయా అంశాలను ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది.  

డిస్కమ్‌ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కేంద్రం ప్రారంభించిన విద్యుత్‌ సంస్కరణలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.  

ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేవలం దృష్టి సారిస్తే సరిపోదు.  పంపిణీకి సంబంధించి  కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్ర, రాష్ట్రాలు పరిష్కరించాలి. అయితే, కేంద్రం ఈ దిశలో అనేక చర్యలతో ముందుకు వస్తోంది. వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాష్ట్రాల సహకారం కూడా    అవసరం.  

ఇప్పటికే ప్రధానికి వినతులు... 
పరిశ్రమ బొగ్గు కొరత సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్సే్చంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్‌ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్‌ విద్యుత్‌ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు, 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి సంయుక్తంగా ఒక వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్‌ ఐరన్‌ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ   తగ్గిపోయింది.  

మరిన్ని వార్తలు