ఆస్ట్రల్ పాలీ జోష్- యాంబర్ డౌన్

9 Nov, 2020 13:23 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాల ఎఫెక్ట్

7.3 శాతం పతనమైన యాంబర్ ఎంటర్ ప్రైజెస్

7.2 శాతం జంప్ చేసిన ఆస్ట్రల్ పాలీటెక్నిక్

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసి పైపుల కంపెనీ ఆస్ట్రల్ పాలీటెక్నిక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో పనితీరు నిరాశపరచడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాలతో కళకళలాడుతుంటే.. రికార్డుల మార్కెట్లోనూ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

ఆస్ట్రల్ పాలీటెక్నిక్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్ట్రల్ పాలీటెక్నిక్ నికర లాభం దాదాపు 7 శాతం బలపడి రూ. 88 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 10 శాతం పెరిగి రూ. 747 కోట్లను అధిగమించాయి. అధెసివ్స్ బిజినెస్ 29 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరడం మెరుగైన పనితీరుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 21 శాతాన్ని దాటాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రల్ పాలీటెక్నిక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్ చేసి రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.2 శాతం పురోగమించి రూ. 1,249ను తాకింది. 

యాంబర్ ఎంటర్ ప్రైజెస్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో యాంబర్ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం నీరసించి రూ. 408 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.34 శాతం క్షీణించి 4.8 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 2,193 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.3 శాతం వెనకడుగుతో రూ. 2,150ను తాకింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా