సీనియర్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ భళా

19 Nov, 2020 14:09 IST|Sakshi

పెద్ద వయసువారిలో రోగనిరోధక శక్తి పెంపు

యువతలోనూ అదేస్థాయిలో పెరిగిన ఇమ్యూనిటీ

రెండో దశ క్లినికల్‌ పరీక్షల డేటా వెల్లడి

మూడో దశ పరీక్షల డేటా రానున్న వారాల్లో

లండన్‌: కోవిడ్‌-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ సీనియర్‌ సిటిజెన్స్‌లో రోగనిరోధక శక్తిని బలంగా పెంపొందిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తాజాగా వెల్లడించింది. క్లినికల్‌ పరీక్షల రెండో దశలో భాగంగా 56-69 ఏళ్ల వయసు వ్యక్తులలో తమ వ్యాక్సిన్‌ పటిష్ట ఫలితాలను సాధించినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే 70 ఏళ్ల వయసు వ్యక్తులతోపాటు.. యువతపైనా ఒకే స్థాయిలో ఇమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేసింది. రెండో దశ పరీక్షలలో భాగంగా 560 మందిపై వ్యాక్సిన్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది. వీరిలో 240 మంది సీనియర్‌ సిటిజెన్స్‌గా తెలియజేసింది. 

ఫలితాలు భేష్
బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ప్రోత్సాహకర ఫలితాలను వెలువరించినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్‌ వినియోగంతో యాంటీబాడీ, టీసెల్స్‌ బలమైన రెస్పాన్స్‌ను కనబరచిరినట్లు వివరించింది. ఈ విషయాలను తాజాగా లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించింది. మూడో దశ క్లినికల్‌ పరీక్షల ప్రాథమిక డేటా రానున్న వారాల్లో వెల్లడికాగలదని నివేదిక పేర్కొంది. తద్వారా సమాజంలోని భిన్న వ్యక్తులకు రక్షణ కల్పించగల అంశంపై మరిన్ని వివరాలు అందగలవని తెలియజేసింది. AZD1222 పేరుతో రూపొందించిన ప్లాసెబో, వ్యాక్సిన్‌ను రెండు డోసేజీలలో  తీసుకున్న వొలంటీర్లలో ఎలాంటి ఇతర ఇబ్బందులూ తలెత్తలేదని వివరించింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్‌)

వైరల్‌ వెక్టర్
యూఎస్‌ ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌, మోడర్నా.. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. అయితే తాము వైరల్‌ వెక్టర్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే వెల్లడించింది. చింపాంజీలలో కనిపించే సాధారణ జలుబుకు సంబంధించిన వైరస్‌ ఆధారంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. గతంలోనే యూకే ప్రభుత్వం 10 కోట్ల డోసేజీల వ్యాక్సిన్లను అందించవలసిందిగా ఆస్ట్రాజెనెకాకు ఆర్డర్లు జారీ చేసింది. దేశీయంగా ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు