ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ముందుగా మనకే!

24 Nov, 2020 13:35 IST|Sakshi

తొలుత దేశీయంగా పంపిణీపై దృష్టి

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ చీఫ్‌ అదార్‌ పూనావాలా వెల్లడి

తొలి బ్యాచ్‌ 2021 ఏప్రిల్‌కల్లా- ప్రభుత్వంతో చర్చలు

యూఎస్‌ వ్యాక్సిన్లకంటే స్పుత్నిక్‌-వి చౌక!

ముంబై, సాక్షి: కోవిడ్‌-19 కట్టడికి బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను తొలుత దేశీయంగా పంపిణీ చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ అదార్‌ పూనావాలా తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు వీలుగా వ్యాక్సిన్ల కొనుగోలుకి దేశీ ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తద్వారా 2021 ఏప్రిల్‌కల్లా తొలి బ్యాచ్‌ను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం సత్ఫలితాలను సాధించిన తమ వ్యాక్సిన్‌ 90 శాతాన్ని సైతం అధిగమించనున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు పూనావాలా చెప్పారు. ఫలితంగా ఫిబ్రవరి, మార్చిలలో పూర్తిస్థాయి అనుమతులకు వీలుండవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌కు త్వరితగతిన అనుమతి పొందేందుకు ప్రయత్నించనున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలియజేసింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేయడం ద్వారా తక్కువ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు వివరించింది.

పంపిణీ సులభం
దేశీ మార్కెట్లలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రూ. 1,000 స్థాయిలో్ ఉండవచ్చని, అయితే ప్రభుత్వం భారీ పరిమాణంలో కొనుగోలు చేయడం ద్వారా మరింత చౌకగా అందించేందుకు వీలుంటుందని పూనావాలా ఇటీవల పేర్కొన్నారు. 2021 జులైకల్లా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు‌ 40 కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ యూకేలో అనుమతి పొందితే.. అత్యవసర వినియోగానికి దేశీయంగానూ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో నిల్వ చేసేందుకు వీలుండటంతో దేశీ మార్కెట్లో సులభంగా పంపిణీ చేయవచ్చని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి.

చౌకలో
యూఎస్‌ కంపెనీల వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ చౌకలో లభించగలదని రష్యా పేర్కొంటోంది. అంతేకాకుండా తమ వ్యాక్సిన్‌ సులభంగా నిల్వ చేయడంతోపాటు.. పంపిణీకీ వీలుంటుందని చెబుతోంది. యూఎస్‌ దిగ్గజాలలో ఫైజర్‌, మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్లు రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుందని పేర్కొంది. కాగా.. ఫైజర్‌ ఇంక్‌ వ్యాక్సిన్‌ ధరను 19.5 డాలర్లుగా తొలుత తెలియజేసింది. అంటే రెండు డోసేజీలకు కలిపి 39 డాలర్లు వ్యయంకాగలదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదేవిధంగా మోడర్నా ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ ధర మరింత అధికంగా 50-74 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు