సమంత అరుదైన ఘనత! అచ్చం ఆమెలాంటి బార్బీ బొమ్మతో..

4 Oct, 2021 13:55 IST|Sakshi

Samantha Cristoforetti Barbie Doll: వన్‌ సెకన్‌.. మీరనుకుంటున్న సమంత కాదిమే. ఈమె ఇటాలియన్‌ ఆస్ట్రోనాట్‌. పూర్తి పేరు సమంత క్రిస్టోఫోరెట్టి(44). అరుదైన ఓ గౌరవం అందుకుని ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌(ISS)కి మొట్టమొదటి యూరోపియన్‌ ఫిమేల్‌ కమాండర్‌ ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు అచ్చం ఆమెలాంటి బొమ్మతో పిల్లల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు.  


ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తోంది యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ. ఇందులో భాగంగా అమ్మాయిలకు స్పేస్‌ స్టడీస్‌తోపాటు సైన్స్‌ టెక్నాలజీ మ్యాథ్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(STEM) రంగాల్లో కెరీర్‌ పట్ల ఆసక్తి కలిగించేందుకు కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం ఐఎస్‌ఎస్‌కు కమాండర్‌గా వెళ్లబోతున్న సమంత బొమ్మను ఉపయోగించబోతున్నారు.

అచ్చం సమంత  క్రిస్టోఫోరెట్టి రూపంతో ఉన్న బొమ్మ(బార్బీ డాల్‌) ఒకదానిని తయారుచేయించి.. అంతరిక్ష ప్రయోగాల్ని, పరిశోధనల అనుభూతుల్ని పిల్లలకు తెలియజెప్పే ప్రయోగం చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీకి చెందిన ఓ జీరో గ్రావిటీ ఫ్లైట్‌ను వినియోగించారు. స్పేస్‌లోకి వెళ్లే ముందు ఏం చేయాలి? అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాల్ని జీరో గ్రావిటీలో సమంత బొమ్మను ఉపయోగించి చూపిస్తారు.


అక్టోబర్‌ 4-10 మధ్య వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ జరుగుతోంది. ఈ ఏడాదిని ‘విమెన్‌ ఇన్‌ స్పేస్‌’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె బొమ్మ ద్వారా పిల్లలకు ఆసక్తికరంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా వచ్చే డబ్బును విమెన్‌ ఇన్‌ స్పేస్‌ ప్రోత్సాహకం కోసం ఉపయోగించనున్నట్లు బార్బీ ప్రతినిధి ఇసాబెల్‌ ఫెర్రెర్‌ తెలిపారు. ఇక తన బొమ్మ ద్వారా పాఠాలపై సమంత సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది.

 

ఇదిలా ఉంటే సమంతా క్రిస్టోఫోరెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తర్వాతి మిషన్‌ కోసం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నారు. ఆరు నెలలపాటు కమాండర్‌ హోదాలో ఆమె ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బార్బీ గతంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు శాలీ రైడ్‌, అన్నా కికినా బొమ్మలను సైతం రూపొందించింది.

చదవండి: నాసా పోస్ట్‌ చేసిన బొమ్మ.. అద్భుతం

మరిన్ని వార్తలు