జ్యోతిష్యులకు బంపర్‌ ఆఫర్‌, వేల ఉద్యోగాలు

29 Jun, 2022 10:32 IST|Sakshi

రెట్టింపు ఆదాయంపై ఆస్ట్రోటాక్‌ దృష్టి  

జ్యోతిష్యంతో రూ.400 కోట్ల వార్షికాదాయం లక్ష్యం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ జ్యోతిష్య ప్లాట్‌ఫామ్‌ ఆస్ట్రోటాక్‌ స్థూల ఆదాయాన్ని ఏడాదిలో దాదాపు రూ. 400 కోట్లకు రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది.  10వేల మంది జ్యోతిష్యులను తన ప్లాట్‌ఫామ్‌లో చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పునీత్‌ గుప్తా వెల్లడించారు. మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలను పెంచడం ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.  

‘‘మా కార్యకలాపాలను, ప్రస్తుత బృందాన్ని పెంచాలని చూస్తున్నాము. మా వద్ద ఉన్న జ్యోతిష్యుల సంఖ్యతో పోలిస్తే వినియోగదరులను (ట్రాఫిక్‌ను) ఆకర్షించడానికి మా మార్కెటింగ్‌ చాలా మెరుగ్గా ఉంది. మా వెబ్‌సైట్‌లో మేము పొందుతున్న ట్రాఫిక్‌ను ప్రస్తుత బృందం నిర్వహించలేకపోతోంది. ఇప్పటికే మా టెక్నాలజీ టీమ్‌లో వ్యక్తులను నియమించుకోవడం ప్రారంభించాము మేము 2022 చివరి నాటికి 10,000 మంది జ్యోతిష్యులతో భాగస్వామి కావాలని చూస్తున్నాము’’ అన్నారు.

3 కోట్ల మంది కస్టమర్లు నమోదు... 
సొంత వనరులతో అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన తన స్టార్టప్‌ ప్లాట్‌ఫారమ్, ఇప్పటి వరకు 3 కోట్ల కస్టమర్‌ సందర్శనలను నమోదు చేసిందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేస్తున్నామని వెల్లడించారు. అయితే 3,500 కంటే ఎక్కువ జ్యోతిష్యుల సేవలను వినియోగించుకోలేకపోయినట్లు తెలిపిన ఆయన, ఇప్పుడు వీరిని భారీగా భాగస్వాములను చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ వార్షిక మార్కెటింగ్‌ బడ్జెట్‌ రూ.72 కోట్లు అయితే, సగటున నెలకు రూ.4 కోట్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.200 కోట్లు అంటే రోజుకు దాదాపు రూ.55 లక్షల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నాన్‌-జ్యోతిష్యుల సంఖ్య దాదాపు 125గా ఉందని పేర్కొంటూ, మరింత మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. కంపెనీ నాన్‌-జ్యోతిష్యుల్లో  రిక్రూటర్‌లు, జ్యోతిష్కుల శిక్షకులు, జ్యోతిష్య భాగస్వాములు, కస్టమర్‌ల కోసం రిలేషన్షిప్‌ మేనేజర్‌లు ఉన్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు