ఎన్‌పీఎస్, ఏపీవై పథకాలకు ఆదరణ

13 Mar, 2023 00:50 IST|Sakshi

చందాదారుల్లో 23 శాతం వృద్ధి

కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై), నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) పథకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చందాదారులు పెద్ద ఎత్తున ఈ పథకాల్లో చేరుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో (2022 మార్చి 5 నుంచి 2023 మార్చి 4 నాటికి) ఈ రెండు పథకాల కింద చందాదారుల సంఖ్య 23 శాతం పెరిగి 6.24 కోట్లుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. విడిగా చూస్తే ఏపీవై చందాదారుల్లో 28 శాతం వృద్ధి ఉంది. గతేడాది మార్చి 4 నాటికి ఈ రెండు పథకాల కింద చందారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది.

ఎన్‌పీఎస్‌ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కాగా, 60.72 లక్షల మంది రాష్ట్రాల ఉద్యోగులు కావడం గమనార్హం. కార్పొరేట్‌ ఉద్యోగుల సంఖ్య 16.63 లక్షలుగా ఉంది. ఏపీవై చందాదారులు 4.53 కోట్లుగా ఉన్నారు. 2015 జూన్‌ 1న కేంద్ర ప్రభుత్వం ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి సామాజిక భద్రత లేని కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, వృద్ధాప్యంలో పింఛను సదుపాయం కోసం దీన్ని ప్రారంభించింది. సభ్యులు నెలవారీ చెల్లించిన చందానుబట్టి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెలా రూ.1,000–5,000 మధ్య పింఛను లభిస్తుంది. 2022 అక్టోబర్‌ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఈ పథకంలో చేరుకుండా కేంద్రం నిషేధించింది. 

మరిన్ని వార్తలు