రికార్డు స్థాయికి ఏటీఎఫ్‌ రేటు.. 

2 May, 2022 02:38 IST|Sakshi

3.22 శాతం పెంపు  

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఎగిసిన నేపథ్యంలో దేశీయంగా విమాన ఇంధన (ఏటీఎఫ్‌) రేట్లు రికార్డు స్థాయికి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇంధనాల మార్కెటింగ్‌ సంస్థలు ఏటీఎఫ్‌ రేటును ఆదివారం 3.22 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 3,649.13 మేర పెరిగి రూ. 1,16,851.46 (లీటరు రేటు రూ. 116.8)కి చేరింది. ఏటీఎఫ్‌ రేట్లను పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది తొమ్మిదోసారి.

ముంబైలో కిలో లీటరు ధర రూ. 1,15,617.24కి,  కోల్‌కతాలో రూ. 1,21,430.48కి, చెన్నైలో రూ. 1,20,728.03కి చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి రేట్లు మారతాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్‌ ధరలు వరుసగా 25వ రోజూ యధాతథంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లను బట్టి విమాన ఇంధనం ధరలను ప్రతి నెలా పదిహేను రోజులకోసారి, పెట్రోల్‌..డీజిల్‌ రేట్లను రోజువారీ సవరిస్తారు.  

మరిన్ని వార్తలు