ఆపిల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ..!

9 Mar, 2022 20:17 IST|Sakshi

స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎథర్ ఎన‌ర్జీ తన ఎథర్ 450 ఎక్స్, ఎథర్ 450 ప్లస్ స్కూటర్లకి చెందిన కీలక భాగాలను తయారు చేయడానికి ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ సబ్సిడరీ భారత్ ఎఫ్ఐహెచ్'తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఎథర్ ఎన‌ర్జీ నేడు చేసిన ఒక ప్రకటనలో.. దేశీయంగా ఏర్పడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ కొరతను తీర్చడానికి ఈ భాగస్వామ్యం ఒప్పందం సంస్థకు సహకరిస్తుందని తెలిపింది. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ దేశీయంగా ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్'లను అసెంబ్లింగ్ చేస్తుంది.

భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫౌల్గర్ మాట్లాడుతూ.. "భారతదేశంలో వారి ఎలక్ట్రిక్ వాహన ప్రయాణానికి మద్దతు ఇవ్వడంలో ఎథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి పేరు గల సంస్థలో అంతర్భాగం కావడంతో మా ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు, సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరించడానికి మేము ఎదురు చూస్తున్నాము" అని ఆయన అన్నారు. బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్, డ్యాష్ బోర్డ్ అసెంబ్లీ, పెరిఫెరల్ కంట్రోల్ యూనిట్, డ్రైవ్ కంట్రోల్ మాడ్యూల్స్ కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్(పీసీబీ) అసెంబ్లీలు వంటి వాటిని భారత్ ఎఫ్ఐహెచ్ తయారు చేస్తుంది. 

భారత్ ఎఫ్ఐహెచ్ ఈ ఉత్పత్తులను ఎథర్ ఎన‌ర్జీ కోసం 'టర్న్ కీ' మోడల్'పై తయారు చేస్తుంది. వారి ఫెసిలిటీ వద్ద ఎథర్ స్కూటర్ల కోసం విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఎథర్ ఎనర్జీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకెళ్తుంది. గత ఏడాది అమ్మకాల్లో 20 శాతం వృద్దిని నమోదు చేసింది. ఎథర్ ఎన‌ర్జీ దాదాపు 99 శాతం ఉత్పత్తులు దేశీయంగా తయారు చేస్తుంది. దీర్ఘకాలిక డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఎథర్ ఎన‌ర్జీ తన హోసూర్ ఫెసిలిటీని సంవత్సరానికి 120,000 నుంచి 400,000 యూనిట్ల సామర్ధ్యానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. 

(చదవండి: దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్‌ పోలీసులు) 

మరిన్ని వార్తలు