బ్యాంకు ఖాతాదారులకు షాక్.. జనవరి 1 నుంచి?

2 Dec, 2021 15:25 IST|Sakshi

మీరు ఎక్కువగా ఏటిఎం కేంద్రాల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. జనవరి 1 నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి ముగిశాక, చేసే ప్రతి లావాదేవీకీ చెల్లించాల్సిన ఛార్జీని రూ.20 నుంచి 21కి పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జూన్ నెలలో బ్యాంకులకు అనుమతించింది. 

ఏటిఎం విత్ డ్రా ఛార్జీలు పెంపు
వచ్చే జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అదనపు భారం బ్యాంకు ఖాతాదారులకు దక్కే నూతన సంవత్సర కానుక అన్నమాట. జనవరి 1, 2022 నుంచి ఉచిత లావాదేవీల నెలవారీ పరిమితి ముగిశాక బ్యాంకు ఖాతాదారులు ప్రతి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఖాతాదారులు తమ స్వంత బ్యాంకు ఏటిఎం కేంద్రాల నుంచి నెలకు 5 సార్లు ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ప్రతి లావాదేవికి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఏటిఎం ఛార్జీల మొత్తం స్వరూపాన్ని సమీక్షించడానికి ఆర్‌బీఐ జూన్ 2019లో అప్పటి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజి కన్నన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన సిఫారసులను జూలై 2020లో వెల్లడించింది. ఏటిఎం ఛార్జీలను లెక్కించడానికి జనాభాను మెట్రిక్‌గా ఉపయోగించాలని కమిటీ సిఫారసు చేసింది.

(చదవండి: Elon Musk: పరాగ్‌పై వివాదాస్పద ట్వీట్‌.. రచ్చ)

మరిన్ని వార్తలు