మెగా బూస్ట్‌:  చెన్నైలో అమెజాన్‌ 

17 Feb, 2021 11:27 IST|Sakshi

భారత్‌లో అమెజాన్‌ ఉత్పత్తుల తయారీ 

క్లౌడ్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం 

సాక్షి,  న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ఫైర్‌ టీవీ స్టిక్స్‌ సహా తమ డివైజ్‌లను చెన్నైలో తయారు చేయనుంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్‌ అనుబంధ సంస్థ క్లౌడ్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీతో జట్టు కట్టనుంది. మేకిన్‌ ఇండియాకు మెగా బూస్టింగ్‌గా భారతదేశంలో టెలివిజన్ స్ట్రీమింగ్ పరికరాల తయారీని ప్రారంభిస్తోంది. ఆత్మనిర్భర్‌ పథకంలో భాగంగా అమెజాన్ త్వరలో భారతదేశంలో ఫైర్‌టివి స్టిక్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రారంభిస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం  వెల్లడించారు.

 ‘భారత్‌లో ఇది తొలి తయారీ కేంద్రం అవుతుంది. స్వావలంబన దిశగా భారత ప్రభుత్వ మేకిన్‌ ఇండియా నినాదానికి మేం కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. భారత్‌లోని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డివైజ్‌ తయారీ ప్రోగ్రాం కింద ఏటా పెద్ద ఎత్తున ఫైర్‌ టీవీ స్టిక్‌ డివైజ్‌లు (వీడియో స్ట్రీమింగ్‌కి ఉపయోగపడేవి) తయారు చేస్తాం‘ అని అమెజాన్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. మేకిన్‌ ఇండియా పట్ల  తమ నిబద్ధతను  ఇది సూచిస్తుందని, ఉద్యోగాల కల్పనకు, నూతన ఆవిష్కరణలను పెంచుతుందని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. అయితే, ప్లాంటు తయారీ సామర్థ్యం, ప్రాజెక్టుపై ఎంత ఇన్వెస్ట్‌ చేయనున్నదీ మాత్రం వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు