ఆత్మనిర్భర్‌తో భారత్‌ స్వయం సమృద్ది: రాజీవ్‌ కుమార్‌

23 Mar, 2022 21:36 IST|Sakshi

ప్రపంచ ఎకానమీతో సంబంధాలు తెగుతాయనడం సరికాదు

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఉద్ఘాటన

జపాన్‌ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగం   

న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన ఆత్మనిర్భర్‌(స్వావలంబన) కార్యక్రమం వల్ల భారత్‌తో ప్రపంచ ఎకానమీకి సంబంధాలు తెగిపోతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు. భారత్‌ స్వయం సంమృద్ధికి దోహదపడే మిషన్‌ ఇదని ఆయన అన్నారు. ప్రపంచ సరఫరా, విలువల చైన్‌లకు  సంబంధించి అంతర్జాతీయంగా పటిష్ట బంధాన్ని కలిగి ఉండడం వల్ల దేశం తన ప్రజలకు మెరుగైన ఫలితాలను సాధించగలుగుతుందని అన్నారు. ప్రపంచ సరఫరాలు, వ్యాల్యూ చైన్‌ విషయంలో ఆత్మ నిర్భర్‌ కార్యక్రమం దేశాన్ని ప్రపంచ ఆర్థిక చిత్రంలో కీలక స్థానంలో ఉంచుతుందని పేర్కొన్నారు.  

కేంద్రం ప్రారంభించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాల కింద భారత్‌లో భారీ స్థాయిలో కంపెనీలను స్థాపించాలని ఆయన జపాన్‌ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణలు, ఎటువంటి అడ్డంకులు లేని అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార రంగం విషయంలో ప్రాంతీయ  అనుసంధానం వంటి విషయాలకు భారత్‌ కట్టుబడి ఉందని అన్నారు. భారతదేశం-జపాన్‌లలో కోవిడ్‌-19ను ఎదుర్కొన్న పద్దతులు, రెండు దేశాల మధ్య ముందుకు సాగుతున్న ఆర్థిక సహకారం... అవకాశాల కోసం అన్వేషణ’ అనే అంశంపై 10వ ఐసీఆర్‌ఐఈఆర్‌-పీఆర్‌ఐ వర్క్‌షాప్‌ సందర్భంగా జరిగిన ఒక వర్చువల్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు..

  • పీఎల్‌ఐ పథకం కింద జపాన్‌ కంపెనీలు  భారత్‌లో పెట్టుబడులు పెట్టి,  ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు దేశాన్ని ఎగుమతి కేంద్రంగా మార్చాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకు అనుగుణమైన పరిస్థితులు భారత్‌కు ఉన్నాయని భావిస్తున్నాం. భారతదేశంలోకి జపాన్‌ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏది అవసరమో ఆయా చర్యలన్నింటినీ తీసుకోడానికి భారత్‌ సిద్ధంగా ఉంది.  
  • ఆత్మనిర్భర్, స్వావలంబన భారత్‌ మిషన్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటివి  కోవిడ్‌-19 పరిస్థితిని ఎదుర్కొని, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తోడ్పాటును అందించే ప్రధాన చర్యలు. ఆత్మనిర్భర్‌ మిషన్‌ దేశాన్ని క్లోజ్డ్‌ ఎకానమీ వైపు నడిపిస్తుందనే భయాన్ని తొలగించడం అవసరం.  
  • గ్లోబల్‌ ఎకానమీ, వాణిజ్యం, సేవలు, ఆర్థిక, సాంకేతిక అంశాలకు సంబంధించి భారతదేశం తన దృఢచిత్తం నుండి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. 
  • రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల సరళీకరణ.. సరళీకృత, గ్లోబల్‌ ఆర్థిక విధానాల పట్ల భారత్‌ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది.  
  • భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి జపాన్‌ సహకారం అందించగలిగే పరిస్థితి ఉంది. ప్రపంచ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎగుమతులను వృద్ధి చేయడంలో భారత్‌కు జపాన్‌ నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయని భావిస్తున్నాం. ప్రపంచ వాణిజ్యం, సంబంధిత సేవల వృద్ధిలో అధిక వాటాను సాధించాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. ఇది భారత్‌ వృద్ధి ఊపందుకోవడానికి, ఉపాధి కల్పన భారీగా పెరగడానికి దోహదపడుతుంది. రాబోయే సంవత్సరాల్లో భారత్‌ దీనిని సాధించడానికి(భారత్‌కు సహాయం చేయడానికి) జపాన్‌ కంపెనీలు తగిన సహకారం అందిస్తాయని భావిస్తున్నాను.  
  • ఇక సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహం, ఎలక్ట్రిక్‌ వాహనాల దిశగా పురోగతి ప్రస్తుత కీలక అంశాలు. జపాన్‌ ఇప్పటికే ఈ రంగంలో ముందంజలో ఉంది. హైడ్రోజన్‌ ఇంధనాన్ని తయారీలో కీలకమైన గ్రీన్‌ అమ్మోనియాను సరఫరా చేయడానికి భారత్‌ కంపెనీల సహాయ సహకారాలను తీసుకునే అవకాశాలను జపాన్‌ పరిశీలించవచ్చు.  
  • భారత్‌ కూడా హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ మిషన్‌లో పురోగమించడంపై దృష్టి పెట్టింది. హైడ్రోజన్‌ ఎకానమీలో జపాన్‌ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని నాకు తెలుసు. టొయోటా తన స్వంత వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ  విషయంలో భారత్‌కు సహాయసహకారాలు అందించాలని జపాన్‌ను నేను అభ్యర్థిస్తున్నాను.  
  • రాబోయే పదేళ్లలో 10 మెట్రిక్‌ మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియాను ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉన్నాము. గ్రీన్‌ అమ్మోనియా హైడ్రోజన్‌(పర్యావరణ సానుకూల) ఆర్థిక వ్యవస్థకు ఆధారం. అందువల్ల  ఈ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.  
  • వచ్చే ఐదేళ్లలో భారతదేశంలో 5 ట్రిలియన్‌ యన్లు(రూ.3,20,000 కోట్లు) లేదా 42 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని జపాన్‌ ప్రకటించింది. అంతక్రితం భారత్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని ఫ్యూమియో కిషిడా మధ్య కీలక చర్చలు జరిగాయి.

(చదవండి: ఐపీఎల్ అభిమానులకు బుక్ మై షో శుభవార్త..!

మరిన్ని వార్తలు