ఈ షేర్లు.. అప్పర్‌- డౌన్‌ సర్క్యూట్స్‌

24 Jul, 2020 11:56 IST|Sakshi

క్యూ1 ఫలితాలు భేష్‌

ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ 5 శాతం హైజంప్‌

డీలిస్టింగ్‌ ధర చెల్లింపునకు నో..

ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ 20% పతనం

విదేశీ మార్కెట్ల బలహీనతల ప్రభావంతో నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ 275 పాయింట్లు క్షీణించి 37,865కు చేరగా.. నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 11,124 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టగా.. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వివరాలు చూద్దాం..

ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ 
స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ చేసేందుకు డిస్కవర్‌ చేసిన రూ. 1100 ధరను కంపెనీ ప్రమోటర్లు తిరస్కరించినట్లు వెలువడిన వార్తలు ఐనియోస్‌ స్టైరోల్యూషన్‌ కౌంటర్‌లో భారీ అమ్మకాలకు దారితీసింది. దీంతో ఐనియోస్‌ కౌంటర్‌ ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 175 కోల్పోయి రూ. 700 వద్ద ఫ్రీజయ్యింది. కంపెనీలో ప్రస్తుత యూకే ప్రమోటర్‌ సంస్థ ఐనియోస్‌ స్టైరొల్యూషన్‌ ఏపీఏసీకు 75 శాతం వాటా ఉంది.  ఈ నెల 7న ప్రమోటర్లు షేరుకి రూ. 480 ధరలో డీలిస్ట్‌ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో డీలిస్ట్‌ చేసేందుకు కౌంటర్‌ ఆఫర్‌ ఇవ్వబోమంటూ ప్రమోటర్లు తాజాగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 6 శాతం బలపడి రూ. 201 కోట్లను తాకింది.  నికర వడ్డీ ఆదాయం 24 శాతం ఎగసి రూ. 1184 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు 2.08 శాతం నుంచి 1.69 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 38 జమ చేసుకుని రూ. 792 వద్ద ఫ్రీజయ్యింది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 21 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

మరిన్ని వార్తలు