5G: శరవేగంగా స్పెక్ట్రం కేటాయింపులు

5 Aug, 2022 09:16 IST|Sakshi

 ఆగస్టు 12 కల్లా కేటాయిస్తాం కేంద్ర మంత్రి వైష్ణవ్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: 5జీ వేలంలో పాల్గొన్న కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు 12 కల్లా కేటాయించే దిశగా ప్రభుత్వం వేగంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కార్యదర్శుల కమిటీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. (Zomato: జొమాటోకు మరో ఎదురు దెబ్బ)

అలాగే, స్పెక్ట్రం సమన్వయ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వివరించారు. దీని కింద ఒక్కో సంస్థకు ఒక్కో బ్యాండ్‌లో విడివిడిగా ఉన్న స్పెక్ట్రంను ఒక్క చోటికి చేరుస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పట్టేస్తుంది. కానీ దీన్ని ఈసారి ఒక్క రోజులోనే పూర్తి చేయగలిగినట్లు వైష్ణవ్‌ చెప్పారు. టెల్కోలు మరింత సమర్థమంతంగా సేవలు అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడగలదని ఆయన తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 1 వరకూ కొనసాగిన 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైన సంగతి తెలిసిందే. 10 బ్యాండ్స్‌లో 72,098 మెగాహెట్జ్‌ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా 51,236 మెగాహెట్జ్‌ స్పెక్ట్రం (సుమారు 71 శాతం) అమ్ముడైంది. విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో దాదాపు సగభాగాన్ని రిలయన్స్‌ జియో రూ. 88,078 కోట్ల బిడ్లతో దక్కించుకుంది.

(చదవండి: అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్‌ రేడియోకు అదరిపోయే వార్త)

మరిన్ని వార్తలు