టోకు ధరలు.. మైనస్‌ నుంచి ప్లస్‌

15 Sep, 2020 06:01 IST|Sakshi

ఆగస్టులో 0.16 శాతం

నాలుగు నెలల ప్రతికూలత తర్వాత ఎగువబాటకు మొదటిసారి

బేస్‌ ఎఫెక్టే కారణమంటున్న నిపుణులు

టోకున తగ్గిన ఆహార ఉత్పత్తుల ధరలు

అయినా ‘రిటైల్‌’లో  సామాన్యుని పాట్లు

9.05 శాతం ధరల పెరుగుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది.  వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో  కీలక అంశాలను పరిశీలిస్తే...

టోకు డిమాండ్‌ మెరుగుపడుతుందనుకోలేం!
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది.  ఆగస్టులో  ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్‌లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్‌ (– 1.57%), మే (–3.37%), జూన్‌ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి.

వ్యవస్థలో డిమాండ్‌ లేమి పరిస్థితులను ప్రతి ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అయితే తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మళ్లీ డిమాండ్‌ కనిపిస్తోందనడానికి సూచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరగడానికి బేస్‌ ఎఫెక్టే కారణమన్నది వారి అంచనా.  అంటే 2019 ఆగస్టులో నమోదయిన టోకు ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండడం (కేవలం 1.17%), ఆర్థిక మందగమనం వల్ల అటు తర్వాత నెలల్లోనూ వ్యవస్థలో పూర్తి ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులే నెలకొనడం వంటి అంశాలతో తాజా సమీక్షా నెల 2020 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం కొంచెం పెరిగినట్లు ‘గణాంకాల్లో’  కనిపిస్తోందన్నది వారి అభిప్రాయం. దీనినే బేస్‌ ఎఫెక్ట్‌ మాయగా నిపుణులు పేర్కొంటారు. కాగా మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.42%.  

మూడు ప్రధాన విభాగాలను చూస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్, నాన్‌ ఫుడ్‌ విభాగాలతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.60 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.51 శాతం. ఇక ఈ విభాగంలో కేవలం ఫుడ్‌ ఆర్టికల్స్‌ను తీసుకుంటే, ద్రవ్యోల్బణం 7.80 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌లో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం (–1.46 శాతం) కొనసాగుతోంది. 2019 ఇదే నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.68 శాతం.  
► ఇంధనం, విద్యుత్‌: ప్రతి ద్రవ్యోల్బణం మైనస్‌ 3.53 శాతం నుంచి మరింతగా మైనస్‌ 9.68 శాతానికి పెరిగింది.  
► తయారీ: తయారీ రంగంలో 1.27 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. 2019 ఆగస్టులో ఇది స్థిరంగా ఉంది.

టోకున ‘నిత్యావసరాల’ మంట
డబ్ల్యూపీఐ... ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం వార్షికంగా చూస్తే 7.80% నుంచి 3.84%కి తగ్గినా, నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా సామాన్యునికి భారంగానే ఉండడం గమనార్హం. కూరగాయల ధరలు 7.03% పెరిగాయి (2019 ఆగస్టుతో పోల్చి). పప్పు దినుసుల ధరలు 9.86% ఎగశాయి. ప్రొటీన్‌ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 6.23% పెరిగాయి.  ఆలూ ధరలు భారీగా 82.93 శాతం ఎగశాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం 34.48% తగ్గాయి.

మరిన్ని వార్తలు