ఆకట్టుకోని అరబిందో ఫార్మా

10 Feb, 2022 08:32 IST|Sakshi

మెప్పించని క్యూ3 ఫలితాలు

నికర లాభం 22% డౌన్‌ 

రూ.604 కోట్లకు పరిమితం 

షేరుకు రూ.1.50 డివిడెండ్‌  

న్యూఢిల్లీ: అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) పనితీరు పరంగా ఆకట్టుకోలేకపోయింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం క్షీణించి రూ.604 కోట్లకు పరిమితమైంది. రవాణా, ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం కంపెనీ లాభాలపై ప్రభావం చూపించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సంస్థ నికర లాభం రూ.777 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఒక శాతం పెరిగి రూ.6,002 కోట్లుగా నమోదైంది.

 ‘‘అధిక ముడి సరుకుల ధరలు, రవాణా వ్యయాలు డిసెంబర్‌ త్రైమాసికంలో లాభాలపై ప్రభావం చూపించాయి. కానీ స్థిరమైన ఆదాయంతో మా వ్యాపారం బలంగా పటిష్టంగానే ఉంది. కీలక ఉత్పత్తులకు ఏపీఐ డిమాండ్‌ బలంగా ఉండడం అనుకూలించింది’’ అని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్, ఎండీ కె.నిత్యానందరెడ్డి తెలిపారు. తమ తయారీ యూనిట్లకు సంబంధించి నెలకొన్న నియంత్రణపరమైన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అలాగే, కాంప్లెక్స్‌ జనరిక్‌ ఉత్పత్తుల అభివృద్ధి ప్రణాళికల్లో స్థిరమైన పురోగతి ఉన్నట్టు తెలిపారు. రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుకు మూడో మధ్యంతర డివిడెండ్‌గా రూ.1.50 చొప్పున (150%) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 
 

మరిన్ని వార్తలు