అరబిందో లాభం డౌన్‌

1 Jun, 2021 02:01 IST|Sakshi

క్యూ4లో రూ. 801 కోట్లు

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ అరబిందో ఫార్మా గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 801 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 863 కోట్ల లాభం సాధించింది.  మొత్తం ఆదాయం సైతం రూ. 6,158 కోట్ల నుంచి రూ. 6,001 కోట్లకు నీరసించింది.  నాట్రోల్‌ విక్రయం నేపథ్యంలో ఫలితాలు పోల్చి చూడతగదని అరబిందో పేర్కొంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అరబిందో నికర లాభం రూ. 5,334 కోట్లకు చేరింది. 2019–20లో రూ. 2,844 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 23,098 కోట్ల నుంచి రూ. 24,775 కోట్లకు ఎగసింది.  

బోర్డు ఓకే..: పూర్తి అనుబంధ సంస్థ ఔరా క్యూర్‌ ప్రైవేట్‌లోగల మొత్తం ఈక్విటీ షేర్లను మరో సొంత అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్‌కు బదిలీ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అరబిందో వెల్లడించింది. ఈ బాటలో యూనిట్‌–16తో కూడిన బిజినెస్‌ను స్టెప్‌డౌన్‌ అనుబంధ సంస్థ వైటెల్స్‌ ఫార్మాకు బదిలీ చేసేందుకు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పేర్కొంది.

కీలక విభాగాలు భేష్‌
కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలోనూ గతేడాది కీలక విభాగాలలో నిలకడైన వృద్ధిని చూపినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ పేర్కొన్నారు. విభిన్నమైన, సంక్షిష్టమైన జనరిక్‌ అవకాశాలపై మరింత దృష్టిపెట్టడం ద్వారా కంపెనీ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించగలిగినట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది ప్రధాన మైలురాళ్లను చేరుకున్నట్లు వివరించారు.  
ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో 3% క్షీణించి రూ. 993 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు