కోవాక్స్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయనున్న అరబిందో

25 Dec, 2020 06:29 IST|Sakshi

యూఎస్‌ కంపెనీతో ఒప్పందం

భారత్, యునిసెఫ్‌కు సరఫరా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ అరబిందో ఫార్మా.. యూఎస్‌కు చెందిన కోవాక్స్‌తో ప్రత్యేక లైసెన్సింగ్‌ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కోవిడ్‌–19 చికిత్సకై కోవాక్స్‌ తయారు చేసిన తొలి మల్టీటోప్‌ పెప్టైడ్‌ ఆధారిత వ్యాక్సిన్‌ యూబీ–612 అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయాలను అరబిందో చేపడుతుంది. భారత్‌తోపాటు యునిసెఫ్‌కు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. యునైటెడ్‌ బయోమెడికల్‌కు చెందిన కోవాక్స్‌ ప్రస్తుతం యూబీ–612 వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ తొలి దశ ఔషధ ప్రయోగాలను నిర్వహిస్తోంది.

ఎంపిక చేసిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వ్యాక్సిన్‌ తయారీ, విక్రయానికి నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ హక్కులు సైతం దక్కించుకున్నామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఫినిష్డ్‌ డోసేజెస్‌ను హైదరాబాద్‌లోని అరబిందోకు చెందిన ప్లాంట్లతో తయారు చేస్తారు. ప్రస్తుతం కంపెనీకి 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. దీనిని 2021 జూన్‌ నాటికి సుమారు 48 కోట్ల డోసుల స్థాయికి చేర్చనున్నారు. వ్యాక్సిన్ల నిర్వహణ, పెట్టుబడుల విషయంలో పేరొందిన కంపెనీల్లో ఒకటైన అరబిందో.. యూబీ–612ను ముందుకు తీసుకెళ్లేందుకు తమకు ఆదర్శ భాగస్వామి అని కోవాక్స్‌ కో–ఫౌండర్‌ మేయ్‌ మేయ్‌ హు చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు